Begin typing your search above and press return to search.

తటస్థులు... తధాస్తు...టీడీపీ మాస్టర్ ప్లాన్...?

By:  Tupaki Desk   |   21 April 2022 11:29 AM GMT
తటస్థులు...  తధాస్తు...టీడీపీ మాస్టర్ ప్లాన్...?
X
రాజకీయాలో గెలుపు ఓటములను ఎపుడూ ప్రభావితం చేసే వర్గం న్యూట్రల్స్ మాత్రమే. వారినే అచ్చ తెలుగులో తటస్థులు అని అంటారు. ఈ తటస్థులు కనుక ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే అందలం. ఇది అనేక ఎన్నికల్లో రుజువైన సత్యం. సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి కోర్ ఓటు బ్యాంక్ ఉంటుంది. దానికి అదనంగా నాలుగైదు శాతం ఓట్లు వస్తే విజయం వరిస్తుంది. ఆ ఓట్లు తగ్గినపుడు ఓటమిపాలు అవుతారు.

ఏపీలో ఇపుడు చూస్తే వైసీపీకి దాదాపుగా యాభై శాతం ఓట్ల షేరింగ్ ఉంది. అయితే ఇది నిలక‌డగా ఉందా లేదా అన్నది ఒక చర్చ. మరో వైపు దాదాపుగా నలభై శాతం ఓట్ల షేర్ తో టీడీపీ సమీప ప్రత్యర్ధి పార్టీగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పది శాతం గ్యాప్ ని తగ్గించాలంటే తటస్థుల పాత్ర అతి ముఖ్యం.

దాంతో చంద్రబాబు తటస్థులకు మరో మారు గట్టిగా పిలుపు ఇస్తున్నారు. తటస్థులకు సీట్లు అని ఆయన బిగ్ ఆఫర్ ఇస్తున్నారు. తాజాగా పార్టీ ఆఫీస్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు తటస్థులకు అప్పీల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరుతున్నారు.

ఏపీని పునర్ నిర్మాణం చేయాలంటే టీడీపీదే ఆ బాధ్యత అని అటువంటి టీడీపీని బలోపేతం చేసే విషయంలో తటస్థులు తమ వంతుగా ముందుకు రావాలని బాబు కోరారు. అంతే కాదు, తటస్థులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు తటస్థులతో చేసిన ప్రయోగం గతంలో ఒకమారు విజయవంతం అయింది.

ఆయన ఉమ్మడి ఏపీలో 1999 ఎన్నికల వేళ తటస్థులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. వారిలో విద్యావంతులు, డాక్టర్లు, లాయర్లు, సేవా భావం కలిగిన వారు అంతా ఉన్నారు. అలా నాటి 294 అసెంబ్లీలో మూడవ వంతు టికెట్లు తటస్థులకు అసెంబ్లీలోనూ 42 ఎంపీ సీట్లలో బాగానే సీట్లను ఇచ్చారు.

ఆ ప్రయోగం ఫలించింది. బాబు నాడు మళ్లీ సీఎం అయ్యారు. ఇక ఇన్నేళ్ళ తరువాత చంద్రబాబు మరోసారి తటస్థులకు పిలుపు ఇస్తున్నారు. ఈసారి తటస్థులకు ఆయన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి. ఏపీలో విభజన తరువాత అభివృద్ధి ఆగిపోయింది. దాంతో ఏ పార్టీకి చెందని ఓటర్లు ఈ పరిణామాల పట్ల మధనపడుతున్నారు.

వారిని ఆకట్టుకునే ఉద్దేశ్యంతోనే బాబు ఈ భారీ పిలుపు ఇచ్చారని అంటున్నారు. తటస్థులకు టికెట్లు ఇస్తే పార్టీలోని వారి సహకారం ఎంతవరకూ ఉంటుందో చూడాలి. అయితే కొత్త వారికి ఫ్రెష్ లుక్ ఉన్న వారికి టికెట్లు కనుక ఇస్తే అదెపుడూ మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పాలి. మొత్తానికి బాబు మాస్టర్ ప్లాన్ తోనే న్యూట్రల్ సెక్షన్ కార్డ్ ని బయటకు తీశారని అంటున్నారు. చూడాలి మరి బాబు పిలుపునకు ఎలాంటి స్పందన లభిస్తుందో.