Begin typing your search above and press return to search.

మా నమ్మకం నువ్వే జగన్‌కి పోటీగా టీడీపీ కొత్త కార్యక్రమం!

By:  Tupaki Desk   |   17 Feb 2023 11:34 AM GMT
మా నమ్మకం నువ్వే జగన్‌కి పోటీగా టీడీపీ కొత్త కార్యక్రమం!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం చివర దశకు వచ్చింది. దీంతో మరో కొత్త కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. 'మా నమ్మకం నువ్వే జగన్‌', 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 18 నుంచి మార్చి 26 వరకు ఈ కార్యక్రమాలను రాష్ట్రమంతా ప్రతి ఇంటికి వెళ్లి నిర్వహించాలని జగన్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు పాల్గోవాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ 'మా నమ్మకం నువ్వే జగన్‌' పేరుతో ఇంటి గుమ్మాలకు స్టిక్కర్లు అంటించనున్నారు.

మరోవైపు జగన్‌ కు ధీటుగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన వ్యూహాలకు పదునుపెట్టారు. ఇప్పటివరకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆయన భావించారు. అయితే నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారమే 2014 వేసవిలోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్‌ మొదలుకుని వైసీపీ ముఖ్య నేతలంతా ప్రకటిస్తూ వస్తున్నారు. మరో 14 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని.. వివిధ కార్యక్రమాలకు ప్రజల ముందుకు వెళ్లాలని జగన్‌ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. తరచూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

దీంతో చంద్రబాబు సైతం జగన్‌ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో విధించిన అధిక చార్జీలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 'బాదుడే బాదుడు' కార్యక్రమం నిర్వహించారు. అలాగే 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో రాష్ట్రమంతా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ సుడిగాలి పర్యటనలు చేశారు.

మరోవైపు నారా లోకేష్‌ 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో యాత్ర ముగిసింది. తిరుపతి జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోంది. ఇంకోవైపు చంద్రబాబు సైతం జిల్లాలవారీగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు రావని తేలిపోవడంతో చంద్రబాబు సైతం పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి పోటీగా 'మళ్లీ మీరే రావాలి' అనే కార్యక్రమానికి చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును గురించి ప్రజలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా 'మళ్లీ మీరే రావాలి' స్టిక్కర్‌ ను ఇళ్లకు అతికించనున్నారని చెబుతున్నారు. అదేవిధంగా లోకేష్‌ పాదయాత్రకు సంఘీభావంగా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు పాదయాత్ర చేయాలని చంద్రబాబు సంకల్పించారని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.