Begin typing your search above and press return to search.

బద్వేల్ బై పోల్ : వార్ వన్‌సైడే..వెనక్కి తగ్గిన బాబు , రీజన్ ఏంటి ?

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:02 AM GMT
బద్వేల్ బై పోల్ : వార్ వన్‌సైడే..వెనక్కి తగ్గిన బాబు , రీజన్ ఏంటి ?
X
కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ పోలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. బద్వేల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే టికెట్‌ ఇచ్చినందున పోటీకి టీడీపీ విముఖత వ్యక్తం చేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని టీడీపీ వెల్లడించింది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేల్‌ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పోలిట్‌ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్‌ టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను టీడీపీ ఖరారు చేసింది. 2019లో బద్వేల్‌ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. కాగా, దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది.

నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో చాలాకాలం పాటు, ఎవరైనా ప్రజాప్రతినిధి అనుకోనిరీతిలో మరణించి, ఆ స్థానం ఖాళీ అయినప్పుడు.. ఆ సీటును ఆ నేత కుటుంబానికి తిరిగి ఇస్తే పోటీ చేయకుండా ఉండటం ఒక సంప్రదాయంగా కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగిన ఈ ఏడేళ్లలో ఏపీలో ఈ విధానం అమలైనా తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఈ సంప్రదాయాన్ని తోసి రాజన్నట్లుగా వ్యవహరించటంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముందున్నారని చెప్పాలి. తాజాగా మాత్రం బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం చంద్రబాబు సంప్రదాయాన్ని గుర్తు చేసి.. పోటీకి దూరంగా ఉండటం ద్వారా తెలివిగా బయటపడ్డారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అధికార పార్టీకి ఉన్న బలం, విపక్షానికి లేదనే చెప్పాలి.

దీనికి తోడు కడప జిల్లాలో అధికార వైసీపీని కాదని, పోటీ చేసిన విజయాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ పోటీ చేసినా, చేతిలో చమురు వదల్చుకోవటంతో పాటు, పార్టీ క్యాడర్ ను మరింత దిగాలు పరచటం మినహా సాధించేది ఏమీ ఉండదు. బద్వేల్ లో ఎవరెంత చేసినా, వైసీపీ అభ్యర్థి విజయం సాధించటం ఖాయం. ఈ విషయంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటిస్తే, తాజాగా పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పోటీకి తాము దూరంగా ఉంటున్నట్లు చెప్పారు.

అయితే, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ, ప్రకటించింది. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్ కామెంట్స్ చేశారు. బద్వేల్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని, కడపలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. బద్వేల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.