Begin typing your search above and press return to search.

ఈ-మెయిల్ తీగ లాగితే టీడీపీ డొంకే కదులుతుందా?

By:  Tupaki Desk   |   12 May 2017 5:29 AM GMT
ఈ-మెయిల్ తీగ లాగితే టీడీపీ డొంకే కదులుతుందా?
X
ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఆయన్ను తెగ చీకాకు పెట్టిన ఈమెయిల్ విషయంలో అసలు సంగతేంటో తేల్చాలని టీడీపీ పరిశోధన మొదలుపెట్టిందట. ఎర్రచందనం స్మగ్లర్లు చనిపోయేందుకు కారణమయిన బాబు - నిధుల సేకరణకు రాకుండా అడ్డుకుని అరెస్టు చేయాలంటూ ఇర్వింగ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు టిడిపి నాయకత్వం సీరియస్‌ గా దృష్టి సారించింది. ఈమెయిల్ ఎవరు పంపారో గుర్తించి, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి ఎన్‌ ఆర్‌ ఐ విభాగం ఇర్వింగ్ మేయర్‌ కు - పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది.

కాగా ఈ మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించడం అతి సులభమేనని భావిస్తున్న టిడిపి నాయకత్వం - ఆ ఖాతాదారుడి మూలాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. బాబు పర్యటనపై ఆసక్తితోపాటు, ఆయనను అప్రతిష్ఠపాలు చేయాలన్న ఆలోచన వైసీపీకి తప్ప మరెవరికీ లేదని పార్టీ నాయకత్వం ఆరోపిస్తోంది. విదేశాల నుంచి నడుపుతున్న వైసీపీ అనుకూల సోషల్ మీడియానే ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఎన్‌ ఆర్‌ ఐ విభాగం కూడా అనుమానిస్తోంది.

అయితే... టీడీపీలోనే అసంతృప్తి వర్గానికి చెందినవారు ఇది పంపించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. టీడీపీలో బయటకు కనిపించకపోయినా చంద్రబాబు వ్యతిరేక వర్గం ఒకటుందని.. ఇది ఆ వర్గం పనేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మెయిల్ ఎవరు పంపారో తెలిస్తే టీడీపీ బండారమే బయటపడుతుందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/