Begin typing your search above and press return to search.

ఊర్లు మునిగాయి ! నిజాలు తేలాయి ?

By:  Tupaki Desk   |   31 July 2022 2:30 AM GMT
ఊర్లు మునిగాయి ! నిజాలు తేలాయి ?
X
ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వానికి విజ‌న్ అంటూ ఏమీ లేద‌ని తెలుగుదేశం చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. ఈ ఆరోపణకు సహేతుకం అయిన కార‌ణాలే ఉన్నాయ‌ని తాజా గ‌ణాంకాలే తార్కాణంగా నిలుస్తున్నాయని టీడీపీ చెబుతోంది. స‌రైన ప్ర‌ణాళిక లేని కార‌ణంగా ఈ ఏడాది గ‌డిచిన రెండు నెల‌ల కాల వ్య‌వ‌ధికి సంబంధించి గోదావ‌రి జ‌లాలు 2,193 టీఎంసీలు వృథా అయ్యాయ‌ని లెక్క‌లు తీసి అడుగుతోంది తెలుగుదేశం.

ప‌లు ప్రాజెక్టులు పూర్తి కాక‌పోవ‌డంతో విలువైన నీళ్లు సముద్రం పాలు కావడమే కాకుండా మధ్యలో వరదలకు దారితీసి అన‌ర్థాల‌కు తావిస్తూ, ఊళ్లను ముంచాయి. ప్రాణాలు కూడా తీశాయి చివరకు ఎందుకూ ప‌నికిరాకుండా సముద్రంలో క‌లిశాయి. ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కాదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు కూడా సంపూర్ణంగా నిధులు ఇచ్చినట్లు వైసీపీ స‌ర్కారు నిరూపించగలదా అని తెలుగుదేశం నేతలు నిలదీస్తున్నారు.

ముఖ్యంగా సీఎం సొంత జిల్లా క‌డ‌ప‌లోనే ప్రాజెక్టుల‌కు దిక్కే లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టుల‌కే కాదు ఏ ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కూ దిక్కే లేద‌ని... అసలు రోడ్లు ఎపుడు వేస్తారని జనసేన వెంటబడుతోంది. వాస్త‌వానికి గ‌త జూన్ నుంచి ఇప్ప‌టి మే వ‌ర‌కూ గ‌ణించే నీటి సంవ‌త్స‌రం ప్ర‌కారం చూసుకున్నా నీటి వృథా అధికంగానే ఉందట.

గోదావ‌రిపై ప్ర‌తిపాదించిన ఏ ప్రాజెక్టు ప‌నీ పూర్తి కాలేద‌ని ప్ర‌ధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప‌ల్నాడు క‌రువు నివార‌ణ అంటూ గోదావ‌రి - పెన్నా పై చేప‌ట్టాల‌నుకున్న ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వ‌లేదని తెలుగుదేశం విమర్శిస్తోంది. వాస్త‌వానికి 2018 లోనే ఈ ప్రాజెక్టుకు శ్రీ‌కారం దిద్దారు అని, అప్ప‌ట్లో దీని అంచ‌నా విలువ ఆరువేల కోట్ల రూపాయ‌లకు పైగానే అని తేలిందట.

వైసీపీ సర్కారు దీనిని ముందుకు తీసుకెళ్లి ఉంటే గోదావ‌రి వృథా జ‌లాల‌ను వినియోగించుకుని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎంతో మేలు జ‌రిగేది. అదేవిధంగా ముంపు స‌మ‌స్య అన్న‌ది ఇంత‌గా ఉండేది కాదు అని తెలుగుదేశం తప్పుపడుతోంది. ఒక లెక్క ప్ర‌కారం తొమ్మిది ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా ఆయ‌కట్టు స్థిరీక‌ర‌ణకు నోచుకునేది కూడా అంటోంది.

కానీ అలాంటివేవీ లేకుండా ఉమ్మ‌డి గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు మేలుచేసే సాగునీటి ప‌థ‌కానికి సంబంధించి నిధుల‌న్న‌వి విదిల్చిన దాఖ‌లాలే లేవని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఇదొక్క‌టే కాదు చిన్న చిన్న కాలువల్లో పూడిక‌తీత ప‌నులు కూడా చేయలేకపోయిన అసమర్థత వైసీపీ సర్కారుది అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.

ఏపీ సర్కారు నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఒక్క శ్రీ‌కాకుళం జిల్లా గార మండ‌లంలోనే ఈ ఏడాది ఆరు వేల ఎక‌రాలు సాగు యోగ్య‌త అన్న‌ది లేకుండాపోయిందని, క‌నీసం ఉపాధి హామీ ప‌థ‌కం కింద కూడా పూడిక‌తీత ప‌నులు చేప‌ట్ట‌లేక‌పోయారు అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇదేవిధంగా ప్ర‌ధాన ప్రాజెక్టులు అయిన నారాయ‌ణ పురం, తోట‌ప‌ల్లి, వంశ‌ధార ( కుడి ఎ డ‌మ కాలువ‌లు) ప్రాజె క్టుల‌కు సంబంధించి ఎక్క‌డా ఏవీ క‌నీస నిర్వహ‌ణ‌కు నోచుకోలేదని ఈ ప్రభుత్వం దిగిపోతే గాని ఉత్తరాంధ్ర బాగుపడదని తెలుగుదేశం నేతలు నినదిస్తున్నారు.