Begin typing your search above and press return to search.

ఆపరేషన్ టీడీపీ... ఇక్కడి నుంచే ప్లాన్

By:  Tupaki Desk   |   5 Jun 2019 10:57 AM GMT
ఆపరేషన్ టీడీపీ... ఇక్కడి నుంచే ప్లాన్
X
అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసిన వైసీపీ.. ఈ అనూహ్య విజయాన్ని అలాగే కొనసాగించాలని భావిస్తోంది.అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. స్థానిక సంస్థలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులను, ఫ్యాన్ కిందకు రావాలంటూ సాదరంగా ఆహ్వానిస్తోంది.

జగన్ క్షేత్రస్థాయి నుంచి వైసీపీని బలంగా తయారు చేయడానికి రాయలసీమ నుంచే పథకం అమలు చేయడానికి డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో వైసీపీలోకి క్షేత్రస్థాయిలో వలసలు పెరిగాయి. ఆ జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకోవడంతో టీడీపీ కింది స్థాయి నేతలంతా వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఇక మండల, గ్రామ స్థాయిలో కీలక పాత్ర పోషించే నాయకులపై వైసీపీ నాయకులు ప్రధానంగా దృష్టి సారించి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ప్రధానంగా కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరగణాన్ని వైసీపీలోకి లాగాలని నేతలు డిసైడ్ అయ్యారు. అయితే అధికారం కోల్పోవడంతో టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ బాట పడుతున్నాయి.

ఇక ఆలూరులో టీడీపీ టికెట్ దక్కని బొజ్మమ్మ దంపతులు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారు. వారితోపాటు టీడీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు వైసీపీలో చేరబోతున్నారు. ఇక శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేంద్ర, , ఆయన సతీమణి వరలక్ష్మి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీలోని ముఖ్య నాయకులంతా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఏపీలో తెలుగుదేశం పార్టీ దుకాణం వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.