Begin typing your search above and press return to search.

బంగారు మాట : రుణం తీర్చేసుకోవాల్సిందే బాబూ...

By:  Tupaki Desk   |   20 May 2022 1:30 PM GMT
బంగారు మాట : రుణం  తీర్చేసుకోవాల్సిందే బాబూ...
X
రుణాలు అన్నవి తీరకే జన్మ జన్మలకు మనిషి పుడతారు అని వేదాంతం చెబుతోంది. ఈ రుణానుబంధాలు అన్నవి అలా చక్రానికి ఆకులు మాదిరి ఒకదాన్ని ఒకటి అనుసరించి ముందుకు సాగుతూ వస్తాయి. ఇది ఒక పరంపర. ఇక్కడ రుణం ముందా, ఫలితం ముందా అంటే జవాబు లేదు. ఇక జీవితమే ఇంత పెద్ద సంక్లిష్టమైన వ్యవహరం అయితే రాజకీయాలలో ఈ అయోమయం, భవ బంధాల బాధలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి.

విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు పదులు. మరి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అది. నాటి నుంచి మొదలుపెడితే నేటి దాకా ఎందరో పార్టీ జెండా మోశారు. అలా మోసిన వారు ఏమీ అవకాశాలు రాకుండానే అసువులు బాశారు. అధికారం చుట్టూ తిరిగే అయారాం గయారం లాంటి వారు తీరా పవర్ పోయాక సమీపంలో కనిపించరు.

అపుడు కూడా జెండా పట్టుకుని నిలబడేది కార్యకర్తలే. ఈ సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైమ్ 2004లో పార్టీ ఓడాక జెండా పట్టింది, అండగా నిలిచింది ఎవరో బాగా తెలుసు. ఇక 2009లో మరోమారు పార్టీ ఓడినా 2012 ఉప ఎన్నికల్లో ఏపీ తెలంగాణాలలో డిపాజిట్లు పోయాక కూడా టీడీపీకి భయం భీతీ లేకుండా చేసిన ధైర్యం అంతా క్యాడరే.

అయితే 2014లో అధికారంలోకి రావడంతోనే క్యాడర్ ని పార్టీ హై కమాండ్ పక్కన పెట్టేసింది. దాంతో వారు దూరమైపోయారు. అలా అయిదేళ్ళు గడిచేసరికి పార్టీకి అధికారమూ పోయింది. నాడు పదవులు అనుభవించిన వారు అయితే ఇపుడు ఎక్కువ శాతం కనిపించడంలేదు. క్యాడర్ మాత్రం మళ్ళీ బాబుతోనే ఉంది. అందుకే ఆయన రాయలసీమ టూర్లో ఎక్కువగా క్యాడర్ గురించే మాట్లాడుతున్నారు.

కర్నూల్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో అయినా అనంతపురం సమావేశంలో అయినా పార్టీ జెండాను భుజాన పెట్టుకుని ఇన్నాళ్ళూ మోశారు మీరు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను అని బాబు భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. నిజంగా ఇది క్యాడర్ కి మంచి మాట. వారి చెవులకు శుభవార్త. బాబు నోట వచ్చిన బంగారు మాట.

నిజంగా ఇది ఇలాగే జరుగుతుందా అన్నదే చూడాలి. అయారాం గయారం లకు ఇక పార్టీలో చోటు లేదు, కష్టపడి పనిచేసిన వారికే అందలాలు అని కూడా బాబు చెబుతున్నారు. అధికారం ఉన్నపుడు అన్నీ తీసుకుని ఇపుడు గమ్మున ఉన్న వారిని దగ్గరకు రానీయను అని బాబు అంటున్నారు.

మరి నిజంగా బాబు ఇలాగే ఆలోచిస్తే క్యాడర్ కి మంచి రోజులు వచ్చినట్లే. పనిచేసే వారికి పదవులు దక్కినట్లే. కానీ ఆ మాట మీద ఎంత వరకూ నిలబడతారు అన్నదే ప్రశ్న. మరి బాబు కనుక రుణాలు బంధాలు అంటూ మాట్లాడి వాటిని కనుక తీర్చుకోక‌పోతే శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్లుగా ఇచ్చేయకపోతే బరువైపోతారు. ఇక్కడ మాత్రం పార్టీ మీద ఒట్టేసి చెబుతున్న బాబు మాట తప్పరనే తమ్ముళ్ళు అంతా అనుకుంటున్నారు.