Begin typing your search above and press return to search.

175కి 175 సీట్లు.. టీడీపీ ధీమా ఇదేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2023 2:30 AM GMT
175కి 175 సీట్లు.. టీడీపీ ధీమా ఇదేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ గట్టిగా కంకణం కట్టుకున్నారు. పార్టీ సమావేశాల్లో ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వై నాట్‌ 175 అని సమరోత్సాహంతో పిలుపునిస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎక్కడా తగ్గడం లేదు. 175కి 175 కాదు.. ముందు పులివెందులలో గెలిచి చూపు అని జగన్‌ కు సవాల్‌ విసురుతున్నారు. పులివెందులలో కూడా టీడీపీ గెలుస్తుందని ఢంకా బజాయించి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ధీమాకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33 అసెంబ్లీ సీట్లున్నాయి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని ప్రాంతాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల ప్రజలు వైసీపీకి ఈసారి మంగళం పాడతారని 33 సీట్లనూ తామే కొల్లగొడతామని లెక్కలు వేసుకుంటోంది.

ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 35 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జనసేనతో టీడీపీ పొత్తు కుదిరితే ఈ రెండు జిల్లాలను కూటమి ఊడ్చిపారేయడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ గతంతో పోల్చుకుంటే జనసేన ప్రభావం ఈసారి ఉభయగోదావరి జిల్లాల్లో గట్టిగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తుతో సాగితే ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న 35 అసెంబ్లీ సీట్లు తమ ఖాతాలో పడతాయని టీడీపీ అధినేత ఉద్దేశంగా ఉందని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్ర మొదటి నుంచి టీడీపీ పెట్టనికోటగా ఉంది. 2019లో వైసీపీ సునామీలోనూ విశాఖ నగరంలో నాలుగు అసెంబ్లీ సీట్లను టీడీపీయే గెల్చుకుంది. విశాఖ ఎంపీ స్థానాన్ని కేవలం 4 వేల ఓట్ల తేడాతోనే పోగొట్టుకుంది. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీనే విజయం సాధించింది. అందులోనూ ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు, వంగలపూడి అనిత వంటి బలమైన నేతలు టీడీపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రను ఒడిసిపట్టడం ఖాయమని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది.

ఇక రాయలసీమలో జగన్‌ సామాజికవర్గంలోనే ఆయనపై వ్యతిరేకత ఉందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్, కర్నూలులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, భూమా అఖిలప్రియ వంటివారి ద్వారా రెడ్ల నేతలపై వల వేస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించి వైసీపీకి గట్టి షాక్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో పొత్తు కూడా కుదిరితే 175కి 175 ఊడ్చిపారేస్తామనే నమ్మకంతో టీడీపీ ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.