Begin typing your search above and press return to search.

విజీనగరం అంత వీజీ కాదు ... ?

By:  Tupaki Desk   |   22 Dec 2021 11:30 PM GMT
విజీనగరం అంత వీజీ కాదు ... ?
X
తెలివైన వారి పని ఏంటి అంటే ఎక్కడ మైనస్ ఉందో చూసుకోవడం. దాన్ని ప్లస్ గా మార్చుకోవడానికి తాపత్రయపడడం. అన్ని రంగాల్లో కూడా ఇది అవసరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇంకా చాలా అవసరం. ఆ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన పనే లేదు. ఆయనకు టీడీపీ బలాబలాలు పూర్తిగా అవగతమే. అయితే ఒక్కోసారి బాబు మొహమాటానికి పోయి కొన్ని తప్పులు చేస్తూంటారు.

అయితే ఈసారి ఎన్నికలు చాలా కీలకం కాబట్టి అలాంటివి చేయకుండా ఆయన చాలా కంట్రోల్ గా ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు ఇపుడు తనకున్న సాంకేతిక సంపత్తిని ఆసరాగా చేసుకుని ఏపీలోని పదమూడు జిల్లాల్లో పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తున్నారు. తాను నేరుగా జిల్లాల టూర్లు వేయకుండానే వర్చువల్ మీటింగ్స్ తోనే పార్టీని యాక్టివ్ చేస్తున్నారు.

అలా ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలలో తన పని మొదలెట్టేశారు. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ సీట్లో వైసీపీ విజయం సాధించి టీడీపీకి చుక్కలు చూపించింది. టోటల్ గా క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీని పక్కన నెట్టేసింది. దాంతో ఈ జిల్లాలో యాక్టివ్ గా ఉండే లీడర్లు తగ్గిపోయాయి.

మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలో అయితే పార్టీ పూర్తిగా పడకేసింది. మరి కొన్ని చోట్ల లీడర్లు ఎక్కువై వర్గ పోరు పీక్స్ చేరుకుని సైకిల్ ని ముందుకీ వెనక్కీ కదలకుండా చేస్తున్నారు. అలాంటి సీట్లలో ఒకటి అయిన నెల్లిమర్లలో రిపేర్లు చేయడానికి బాబు రెడీ అయ్యారు. నెల్లిమర్ల నియోజకవర్గం కాక ముందు భోగాపురంగా ఉండేది. ఈ భోగాపురం టీడీపీకి కంచుకోట.

అక్కడ 1983 నుంచి అనేక దఫాలుగా గెలిచి ఒకసారి మంత్రి కూడా అయిన చరిత్ర పతివాడ నారాయణస్వామిది. ఆయన ఇపుడు వయోవృద్ధుడు అయ్యారు. దాంతో నెల్లిమర్లలో కొత్త వారిని ఇంచార్జిని చేయడం ద్వారా పార్టీని పరుగులు పెట్టించాలని బాబు చూస్తున్నారు. నెల్లిమర్లలో పతివాడకు పట్టుంది. తన తరువాత తన కుటుంబం వారికే టికెట్ ఇవ్వాలని ఆయన తాజాగా జరిగిన వర్చువల్ మీటింగులో బాబు ముందు ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు.

తన మనవ‌డు పతివాడ తారకరామారావుకే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో సీనియర్ నేత కర్రొతు బంగార్రాజు దూకుడు మీద ఉన్నారు. ఆయన పతివాడ ప్రతి విజయం వెనకా ఉన్నారు. ఈ రోజుకు పార్టీ అక్కడ గట్టిగా ఉంది అంటే ఆయనే కారణం అంటారు. దాంతో తనకే ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తే పార్టీని గెలిపించుకుని వస్తానని చెబుతున్నారు. మరో వైపు ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు బంధువు కర్రి చంద్రశేఖర్ కూడా రేసులో ఉన్నారుట. దాంతో వర్చువల్ మీటింగ్ లో చంద్రబాబు ఎటూ తేల్చలేకపోయారని అంటున్నారు.

అయితే పతివాడ ఫ్యామిలీ నుంచి టీడీపీని బయటకు తెస్తేనే ఫ్యూచర్ ఉంటుంది అన్న వారే ఎక్కువగా ఉన్నారని టాక్. మరి చంద్రబాబు మొహమాటాలకు పోకుండా వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టి కొత్త వారికి పట్టం కడితేనే నెల్లిమర్లలో టీడీపీకి విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ఇతర నియోజకవర్గాల పరిస్థితి మీద కూడా బాబు స్టడీ చేస్తున్నారుట. ఈసారి తొమ్మిదికి తొమ్మిది సీట్లు టీడీపీ పరం అయ్యేలా క్యాడర్ ని మొత్తం రీచార్జి చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ లెక్కన చూస్తే విజీనగరం వైసీపీకి ఈసారి అంత వీజీ కాదు అనే చెప్పాలి.