Begin typing your search above and press return to search.

ఆ పార్టీ కొత్త కార్యక్రమం.. ఇదేం ఖర్మ!

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:30 PM GMT
ఆ పార్టీ కొత్త కార్యక్రమం.. ఇదేం ఖర్మ!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. కొద్ది నెలల క్రితం ఒంగోలులో నిర్వహించిన పార్టీ మహానాడు అంచనాలకు మించి విజయవంతమైంది. అలాగే వైసీపీ ప్రభుత్వ ధరల పెంపకంపై చేపట్టిన బాదుడే బాదుడు, జిల్లాల్లో చేపట్టిన మినీ మహానాడు వంటి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలవారీగా నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని.. తనను గెలిపిస్తేనే అసెంబ్లీకి వస్తానని లేకపోతే రానని సెంటిమెంటును రగులుస్తున్నారు.

ఇంకోవైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ జనవరి 27 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు లోకేష్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి రోడ్‌ మ్యాప్‌ కూడా సిద్ధమైందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. బాదుడే బాదుడు తరహాలో ఇదేం ఖర్మ పేరుతో ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. దారుణాలు ఏ టెర్రరిస్టులో చేయలేదని.. పోలీసుల సహకారంతో ప్రభుత్వమే విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. టీడీపీ ఎప్పుడూ జాతీయ భావాలతోనే ముందుకు వెళ్లిందని చంద్రబాబు గుర్తు చేశారు.

జాతీయ ప్రత్యామ్నాయాల్లో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు తెలిపారు. పలు సంస్కరణలు ప్రవేశపెట్టడంలో టీడీపీ ముందుందని.. దేశానికే దిక్సూచిగా ఉండేలా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రతిపక్షంలోనూ అంతే బాధ్యతగా ఉన్నామని చెప్పారు.

తన జీవితంలో ఎంతోమంది సీఎంలను, ప్రభుత్వాలను చూశానని.. అయితే ఇంత దారుణమైన, నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదని నిప్పులు చెరిగారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.