Begin typing your search above and press return to search.

మాచ‌ర్ల గాయాలు మ‌రిన్ని.. మానేదెప్పుడు..?

By:  Tupaki Desk   |   25 Dec 2022 7:30 AM GMT
మాచ‌ర్ల గాయాలు మ‌రిన్ని.. మానేదెప్పుడు..?
X
టీడీపీకి మాచ‌ర్ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌... ఇదొక్క‌టే కాదు.. ఇదొక్క‌సారేకాదు. ఇప్ప‌టికే మాచ‌ర్ల‌లో రెండు సార్లు ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత‌ల‌ను మాచ‌ర్ల న‌డిబొడ్డుపై అడుగు పెట్ట‌కుండా.. వైసీపీ నాయ‌కులు పంపించేసిన ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి.

గత స్థానిక ఎన్నిక‌ల్లో మాచ‌ర్ల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ తాలూకు గాయాలు ఇప్ప‌టికీ ఇక్క‌డి నేత‌లు మ‌రిచిపోలేక పోతున్నారు.

ఇక‌, ఇటీవ‌ల మ‌రింతగా అన్న‌ట్టు ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే.. వీటిని ప‌రిష్క‌రించేందుకు అధినేత చూపుతున్న చొర‌వ అంత‌? అనేది కూడా ప్ర‌శ్న‌గానే ఉంది. ఎందుకంటే.. ఇటీవ‌ల ఘ‌ట‌న త‌ర్వాత కేవలం డీజీపీకి ఒక లేఖ‌రాసి.. మీడియా ముందు.. నాలుగు కామెంట్లు చేసి స‌రిపుచ్చారు. త‌మ వాళ్ల‌ను ఏమైనా అంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇక‌, అంతే. స‌రిపెట్టేశారు.

అయితే. ఇలా చంద్ర‌బాబు చేతులు దులుపుకోవ‌డంవ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమైనా ఉందా? అనేది ప్ర‌శ్న‌. ఎందు కంటే.. రాష్ట్రంలో మాచ‌ర్ల ఘ‌ట‌న‌ల త‌ర‌హావి.. రెండు మూడు రోజులుగా జ‌రుగుతూనే ఉన్నాయి.

తంబ‌ళ్ల ప‌ల్లెలో టీడీపీ నేత‌ల‌ను వైసీపీ నాయ‌కులు త‌రిమి కొట్టారు. దీనికి కార‌ణం.. అక్క‌డ కూడా ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు రెడీ కావ‌డ‌మే. తంబ‌ళ్ల‌ప‌ల్లెలో మంత్రి పెద్దిరెడ్డి సోద‌రుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.

దీంతో అక్క‌డ వైసీపీ నాయ‌కుల హ‌వానే సాగుతోంది. ఫ‌లితంగా టీడీపీ వారిని అడుగు కూడా పెట్ట‌నివ్వ‌డం లేదు. ఇక‌, మ‌రోవైపు.. పీలేరులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చివ‌రాఖ‌రుకు.. తిరుప‌తిలోనూ.. టీడీపీ నాయ‌కులు ఇదేం ఖ‌ర్మ నిర్వ‌హిస్తుంటే.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు నిలువ‌రిస్తున్నారు. మ‌రి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. ఈ గాయాల‌ను మాన్పేదెన్న‌డు.. పార్టీని గాడిలో పెట్టేదెన్న‌డు..!