Begin typing your search above and press return to search.

టీడీపీకి అస‌లు ఆ ఉద్దేశ్య‌ముందా?

By:  Tupaki Desk   |   17 July 2021 7:40 AM GMT
టీడీపీకి అస‌లు ఆ ఉద్దేశ్య‌ముందా?
X
రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన పార్టీలు కూడా ఎన్నిక‌ల్లో అధికారం కోసం పాటు ప‌డుతాయి. ఆ దిశ‌గా ఏ చిన్న అవ‌కాశం దొరికినా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకే ప్ర‌య‌త్నిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీని గ‌ద్దె దింపేందుకు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చూర‌గొనేందుకు నిరంత‌రం కృషి చేస్తాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకునే దిశ‌గా సాగుతాయి.

కానీ రెండున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా రాజీక‌య అనుభ‌వం ఉన్న తెలుగు దేశం పార్టీ మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరిగి అధికారం ద‌క్కించుకునే దిశ‌గా ఎలాంటి ప్రయ‌త్నాలు చేయ‌ట్లేద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న ఆ పార్టీ ప్ర‌జ‌ల మెప్పును పొందేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోవ‌ట్లేద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. దీంతో అస‌లా పార్టీకి మ‌ళ్లీ పాల‌న చేసే ఉద్దేశ్యం ఉందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ‌లో ఎలాగో ఆ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని తేలిపోయింది. ఇక ఏపీలోనూ పార్టీ తీరు మార‌డం లేదు. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దూకుడు త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. కేవ‌లం ఇప్పుడు అధికారంలో ఉన్న జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు క‌లిసొస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఊహల్లో తేలుతున్నారు.

అంతే త‌ప్ప రాష్ట్రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై పోరాడి, ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవాల‌నే ప్ర‌ణాళిక మాత్రం లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించే దిశ‌గా కేంద్రం చ‌ర్య‌ల‌పై టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే ఇందుకు నిద‌ర్శ‌నంగా మారింది. ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీక‌ర‌ణ‌క‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా త‌మ గ‌ళం వినిపిస్తున్నాయి కానీ క్షేత్ర స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయ‌ట్లేద‌నేది కాద‌న‌లేని నిజం. ఆందోళ‌న చేస్తున్న కార్మిక సంఘాల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతోనే త‌మ ప‌ని అయిపోయిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ఆరంభం కానున్న నేప‌థ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశానికి ప్రాధాన్య‌త పెరిగింది. అయితే ఈ స‌మావేశాల్లో కేంద్రాన్ని నిల‌దీయ‌డానికి వైసీపీ నాయ‌కత్వం వ‌హించాల‌ని కోరిన టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు, ఆ పార్టీ ముందుకొస్తే రాజీనామాల‌కు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక్క‌డే ఆ పార్టీ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

విశాఖ ఉక్కు స‌మ‌స్య మీద అంత చిత్త‌శుద్ది ఉంటే టీడీపీనే ఈ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించి.. అప్పుడు వైసీపీ క‌లిసి రాక‌పోతే అధికార పార్టీపై ఒత్తిడి పెంచొచ్చు. అలా చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల అభిమానాన్ని పొంద‌వ‌చ్చు. కానీ అలా కాకుండా స‌మ‌స్య‌కు కార‌ణ‌మైన కేంద్రాన్ని వదిలేసి జ‌గ‌న్‌కు ఇర‌కాటంలో పెట్టాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ప్ర‌య‌త్నం క‌చ్చితంగా బెడిసికొట్టే ప్ర‌మాదం ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తిన జ‌ల వివాదంపై కూడా త‌న వైఖ‌రిని స్ప‌ష్టంగా చెప్ప‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్‌ పై మాత్రం విమ‌ర్శ‌లు చేశారు. మ‌రోవైపు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కు లేఖ‌లు రాయ‌డంతో ఆ పార్టీకి సీమ‌పై ఉన్న వ్య‌తిరేక బుద్ధి బ‌య‌ట‌ప‌డింద‌నే వాద‌నకు బ‌లం చేకూరింది. జ‌ల వివాదంపై పూర్తి అవ‌గాహ‌న తెచ్చుకోకుండా.. స‌మ‌స్యకు కార‌ణం తెలుసుకోకుండా కేవ‌లం జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డంతో టీడీపీ క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతుంద‌నే ఆందోళ‌న సొంత పార్టీ శ్రేణుల్లోనే లేక‌పోలేదు.