Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు డిమాండ్ పెరిగిపోతోంది మ‌రి!

By:  Tupaki Desk   |   22 Oct 2016 10:53 AM GMT
లోకేష్‌ కు డిమాండ్ పెరిగిపోతోంది మ‌రి!
X
ఎవ‌రు అవున‌న్నా కాదాన్నా..దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ రాజ‌కీయాలే రాజ్యం ఏలుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యంలో ఇది మొద‌ట ప్రారంభం అయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల అది స‌ద్దుమ‌ణిగింది. కానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - యువనేత లోకేష్ విష‌యంలో ఈ చ‌ర్చ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా జ‌రిగిన పోలిట్ బ్యూరో స‌మావేశంలో అయితే దాదాపు ముప్పాతిక స‌మ‌యం లోకేష్ కేంద్రంగా సాగ‌డం గ‌మ‌నార్హం.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సుదీర్ఘంగా జరిగిన పాలిట్‌బ్యూరో సమావేశంలో ఎక్కువ సమయం లోకేష్‌ కు అప్పగించాల్సిన బాధ్యతలపైనే చర్చ సాగింది. గతంలో లోకేష్‌ మూడ్రోజులు గుంటూరు - నాలుగురోజులు హైదరాబాద్‌ లోని పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు అనుగుణంగా లోకేష్‌ ను తెలంగాణా రాజకీయాల్లో మరింత క్రియాశీలం చేయాలంటూ తెలంగాణకు చెందిన పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ - కార్యనిర్వాహకాధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలు చంద్రబాబుకు సూచించారు. అయితే ఇతర సభ్యులు దీన్ని ఆమోదించలేదు. లోకేష్‌ కు పాలనానుభవం సమకూరినందున పార్టీలో మరిన్ని బాధ్యతల‌తో పాటు ప్రభుత్వంలో కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబుకు సూచించారు. అప్పుడే విపక్షాలనుంచి ఎదుర‌వుతున్న విమర్శల్ని కట్టడి చేసే వీలుంటుందని పేర్కొన్నారు. దీంతో పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని తెలుగుదేశం పార్టీ పాలిట్‌ బ్యూరో సమావేశం తీర్మానించింది.

తెలంగాణాలో నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ‌గా వారి కుటుంబాల‌ను ఆదుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందంటూ తీర్మానించిన పాలిట్‌ బ్యూరో సమావేశం తెలంగాణాలో ఉద్యమ నిర్మాణానికి నిర్ణయించింది. మ‌రోవైపు ఈ సమావేశంలో 14 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇందులో ఎనిమిది ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన అంశాలు కాగా మిగిలిన ఆరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించాలని సమావేశం తీర్మానించింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించింది. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదును మరింత వేగవంతం చేసి ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దుల్ని గెలిపించుకోవాల‌ని తీర్మానించారు. అలాగే మున్సి పల్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను సంబంధిత మంత్రులు - నియోజకవర్గాల ఇన్‌ చార్జిలకే అప్పగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. ప్రతి మూడుమాసాలకోసారి పార్టీపరంగా వివిధ మార్గాల్లో ప్రజాప్రతినిధుల పనితీరుపై సమీక్షలు - అధ్యయనాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. పనితీరుకనుగుణంగానే సీట్ల కేటాయింపు జరగాలని కూడా నిర్ణయించింది. మొహమాటానికి పోయి ఒకరిద్దరికి సీట్లిస్తే అది మొత్తం పార్టీ విజయావకాశాల్నే దెబ్బతీసే ప్రమాదముంటుందని అభిప్రాయపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/