Begin typing your search above and press return to search.

ఎర్ర‌న్న కోట‌లో... టీడీపీ ముక్క‌లైపోతోందిగా?

By:  Tupaki Desk   |   19 July 2017 9:55 AM GMT
ఎర్ర‌న్న కోట‌లో... టీడీపీ ముక్క‌లైపోతోందిగా?
X
టీడీపీ దివంగ‌త నేత‌ - మాజీ ఎంపీ కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు... త‌న సొంత జిల్లా శ్రీ‌కాకుళంను పార్టీకి పెట్ట‌ని కోట‌గానే మ‌లిచారు. శ్రీ‌కాకుళం పార్ల‌మెంటు స్థానంతో పాటు ఆ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో టీడీపీ నేత‌లే విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు కూడా శ్రీ‌కాకుళం పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎర్ర‌న్నాయుడి కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు - టెక్కలి అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి ఎర్ర‌న్న సోద‌రుడు కింజ‌రాపు అచ్చాన్నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కేబినెట్ లో అచ్చెన్నాయుడు కీల‌క శాఖ‌ల మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఎర్ర‌న్న స్థాయిలోనే రామ్మోహ‌న్ నాయుడు టీడీపీలో స‌త్తా క‌లిగిన నేత‌గా ఖ్యాతిగాంచారు. ఎర్ర‌న్నాయుడు బ‌తికున్నంత కాలం కూడా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీదే హ‌వాగా న‌డిచింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే టీడీపీ విజ‌యావ‌కాశాల‌కు గండికొడుతూ వైసీపీ కూడా మెరుగైన ఫ‌లితాల‌నే సాధించింది.

ఈ క్ర‌మంలో జిల్లాపై పార్టీ ప‌ట్టు జారిపోతోంద‌న్న భావ‌న‌తో అచ్చెన్నాయుడు... స‌ర్దుబాటు య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అవి ఫ‌లించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. జిల్లాలో ప‌లాస మునిసిపాలిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్క‌డ ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా... టీడీపీకే మెజారిటీ ద‌క్కుతూ వ‌స్తోంది. గ‌డ‌చిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లాస మునిసిపాలిటీలో 25 స్థానాలు ఉండ‌గా, వాటిలో ఏకంగా 18 స్థానాల‌ను టీడీపీ గెలుచుకుంది. పార్టీలో సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న కోత పూర్ణ‌చంద్ర‌రావు మునిసిప‌ల్ చైర్మ‌న్‌ గా ఎన్నిక‌య్యారు. మొన్న‌టిదాకా ప‌రిస్థితి బాగానే ఉన్నా... ఇటీవ‌లి కాలంలో పూర్ణ‌చంద్ర‌రావు ఏకాకిగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే - టీడీపీ నేత గౌతే శ్యాంసుంద‌ర్ శివాజీతో ఇటీవ‌లి కాలంలో పూర్ణ‌చంద్ర‌రావుకు విభేదాలు పొడ‌చూపాయి. ఎర్ర‌న్నాయుడికి కుడిభుజంలా వ్య‌వ‌హ‌రించిన పూర్ణ‌చంద్ర‌రావును గౌతు దూరంగా పెడుతూ వ‌స్తున్నార‌ట‌.

అయితే ఈ విష‌యంపై స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ అటు రామ్మోహ‌న్ నాయుడు గానీ, అచ్చెన్నాయుడు గానీ పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదన్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు గౌతు కుమార్తె - జిల్లా టీడీపీ అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్న‌ గౌతు శిరీష కూడా త‌న తండ్రి వైపే మొగ్గ‌డం - పూర్ణ‌చంద్ర‌రావును ఏమాత్రం ప‌ట్టించుకోకపోవ‌డం వంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పూర్ణ‌చంద్ర‌రావు గ‌ళం విప్పిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గౌతు ఫ్యామిలీతో పాటు రామ్మోహ‌న్ నాయుడుపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించిన పూర్ణ‌చంద్ర‌రావు జిల్లా టీడీపీలో పెద్ద క‌ల‌క‌లమే రేపారు. ఈ విష‌యంపై స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ ఈ విభేదాల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ల‌ను ఏ ఒక్క‌రికి అప్ప‌జెప్ప‌కుండా పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో పూర్ణ‌చంద్ర‌రావు ప‌లు వివాదాల్లో కూరుకుపోయారు. మునిసిప‌ల్ చైర్మ‌న్‌ పై దాడి చేయ‌డం - ఇటీవ‌ల పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌ గా పోలీసుల‌కు చిక్కిపోవ‌డం జ‌రిగింది. అయితే ఈ వివాదాల‌న్నీ కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేక వ‌ర్గంగా ఉన్న గౌతు ఫ్యామిలీ కుట్ర‌గా ప్ర‌చారం సాగుతోంది. ప‌రిస్థితి చేయి దాటిపోయిన క్ర‌మంలో చంద్ర‌బాబు ఆదేశాల‌తో పూర్ణ‌చంద్ర‌రావును పార్టీ నుంచి సస్పెండ్ చూస్తూ ఉత్త‌ర్వులు జారీ అయిపోయాయి. పార్టీకి న‌మ్మిన‌బంటుగా ఉన్న పూర్ణ‌చంద్ర‌రావు స‌స్పెన్ష‌న్‌ పై ప‌లాస టీడీపీలో పెను క‌ల‌క‌ల‌మే రేగింది. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన 18 మంది వార్డు స‌భ్యుల్లో ఏకంగా ఏడుగురు కౌన్సిల‌ర్ల‌తో పాటు ఓ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ కూడా నిన్న త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు. దీంతో అక్క‌డ ఒక్క‌సారిగా రాజ‌కీయ ప్ర‌తిష్టంబన నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా తానేం పాపం చేశాన‌ని స‌స్పెండ్ చేశార‌ని అటు పూర్ణ‌చంద్ర‌రావుతో పాటు ఆయ‌న అనుచ‌రులు పార్టీ అధిష్ఠానాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా నేరుగా ఎలా సస్పెండ్ చేస్తార‌న్న పూర్ణచంద్ర‌రావు ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చే నాథుడే క‌రువ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ కీల‌క వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పుడు ఎర్ర‌న్నాయుడు బ‌తికి ఉంటే... త‌నకు ఇంత అన్యాయం జ‌రిగి ఉండేదా? అని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు జిల్లాలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎర్ర‌న్నాయుడు ఉన్నంత‌కాలం జిల్లాలో పార్టీ ప‌రిస్థితి మెరుగ్గానే ఉన్నా... ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత పార్టీ నేత‌లంతా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీకి తీర‌ని న‌ష్టం చేకూరుస్తున్నార‌న్న‌ది పూర్ణచంద్ర‌రావు వాద‌న‌గా వినిపిస్తోంది. అంటే ఎర్ర‌న్నాయుడు మ‌ర‌ణంతోనే జిల్లాలో పార్టీకి ప‌ట్టు కోల్పోయిన‌ట్లేన‌ని కూడా ఆయ‌న వ‌ర్గం వాదిస్తోంది. ఈ లెక్క‌న ఆ జిల్లాలో టీడీపీ ప‌త‌నం మొద‌లైన‌ట్టేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.