Begin typing your search above and press return to search.

తిరుగులేని జిల్లాలో తిరగబడ్డ టీడీపీ

By:  Tupaki Desk   |   5 July 2019 5:30 PM GMT
తిరుగులేని జిల్లాలో తిరగబడ్డ టీడీపీ
X
ఆ జిల్లా అనాదిగా టీడీపీకి కంచుకోట.. నాటి ఎన్టీఆర్ హయాం నుంచే టీడీపీని ఆదరిస్తున్న జిల్లా ఇదీ. కానీ ఈసారి వైసీపీ సునామీలో ఆ జిల్లా టీడీపీ చేజారింది. కృష్ణా జిల్లా మొత్తం 16 నియోజకవర్గాల్లో ఇద్దరే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ - గన్నవరం నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. 14 సీట్లు వైసీపీ గెలుచుకొని విజయబావుటా ఎగురవేసింది.

అయితే గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బాబును కలవడం లేదు.. కనీసం టీడీపీ కార్యక్రమాలకు రావడం లేదు. పార్టీలో యాక్టివ్ గా లేక స్తబ్దుగా రాజకీయం నడిపిస్తున్నారు. గద్దె రామ్మోహన్ - వల్లభనేని వంశీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల బాబు అమరావతిలో నిర్వహించిన సమీక్షలకు హాజరుకాలేదు. పైగా వంశీ - గద్దె పార్టీ మారబోతున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

ఇక వీరే కాదు.. ఈ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మండలి చైర్మన్ గా వ్యవహరించిన మండలి బుద్ధ ప్రసాద్ - మంత్రులుగా చేసిన కొల్లు రవీంద్రదీ అదే పరిస్థితి. మరో మంత్రి దేవినేని ఉమా ఓడినా టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కానీ ఈయనను గెలిచిన ఎంపీ కేశినేని నాని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో కామెంట్ల యద్ధం చేస్తున్నారు.

ఇక మాజీ మంత్రి జవహర్ కూడా కృష్ణా జిల్లాలో పోటీచేసినా ఆయన సైలెంట్ అయ్యారు. కొల్లు రవీంద్రలాగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా చంద్రబాబు ఓటమిని జీర్ణించుకొని ప్రజల్లోకి వచ్చినా గెలిచిన, ఓడిన కృష్ణా జిల్లా నేతలు ఇప్పటికీ తేరు కోకపోవడం.. టీడీపీకి దూరంగా ఉండడం చంద్రబాబుకు షాక్ ల మీద షాకులిస్తుండడం టీడీపీ అధినేతను కలవరపెడుతోంది.