Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ ప్ర‌జా చార్జిషీట్‌.. ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   31 May 2022 7:30 AM GMT
జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ ప్ర‌జా చార్జిషీట్‌.. ఏమ‌న్నారంటే!
X
జగన్‌ మూడేళ్ల పాలనపై 1,111 అంశాలతో టీడీపీ ప్రజా చార్జిషీటు తయారు చేసింది. ‘క్విట్‌ జగన్‌..సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరిట 78 పేజీలతో దీనిని రూపొందించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరాన్ని నిర్వీర్యం చేయడం, అన్నింటా రివర్స్‌ పాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ల‌డం, నేరచరితులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వ‌డం వంటి అనేక అంశాల‌ను చార్జిషీటులో పొందు ప‌రిచారు.

జగన్‌ పాలన చూసి లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సిన 139 సంస్థలు అమరావతి నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. 175 నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు సమకూర్చగల రూ.రెండు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిరర్థకం చేశారు. అమరావతి రైతులపై దుష్ప్రచారం చేశారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధానిపై తప్పుడు ప్రచారం చేశారు. చివరకు రాజధాని ఏదని అడిగితే చెప్పుకోలేని దుస్థితి తెచ్చారు. ఈ దుస్థితిని తొలగిస్తూ హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది.

ఈ సంద‌ర్భంగా టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ విధ్వంసకర పాలన కు మూడేళ్లు పూర్తయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల పాలనపై 1,111 అంశాలతో తెలుగుదేశం రూపొందించిన చార్జిషీటును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ పాలనకు శ్రీకారం చుట్టారని.. అరాచక పాలనకు తెరతీశా రని మండిపడ్డారు. సొంత మీడియాలో పనిచేసే వారిని ప్రభుత్వ సలహాదారు లు, పీఏలుగా తీసుకుని వారికి అత్యధికంగా జీతాలివ్వడమే కాకుండా తన పత్రికకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన రూపంతో దోచిపెడుతున్నారని విరుచుకుపడ్డారు.

పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెస్తానని గొప్పలు చెప్పి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకువెళ్లారని ధ్వజ మెత్తారు. ‘టీడీపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రయత్నించలేదు సరికదా.. సర్వనాశనం చేశారు. పోలవరం, రాజధాని అమరావతి పనులు రివర్స్‌లో ఉన్నాయి. విపక్ష నేతగా అప్పటి టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ అన్నింటా బాదుడే బాదుడూ.. అంటూ దీర్ఘాలు తీసిన జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వీరబాదుడు బాదుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా చెత్తపై పన్ను వేశారు. మూడేళ్ల పాలనపై గడప గడపకు వెళ్లిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులను జనం ఛీకొట్టి ఎక్కడికక్కడే నిలదీశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన విషయం గుర్తిం చిన వైసీపీ.. సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర ప్రారంభించింది. దానికి కూడా తిరస్కారమే ఎదు రైంది. పది మంది బీసీలకు మంత్రి పదవులిచ్చి పవర్‌ మాత్రం రెడ్లకు అప్పగించింది. మొత్తం 56 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. ఏపీలో బీసీలే లేనట్లు తెలంగాణకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటిచ్చారు.

రైతుభరోసాతో జగన్‌ మోసం చేశారు. సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించిన వ్యక్తి చీప్‌ లిక్కర్‌తో మూడేళ్లుగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇసుకను ప్రైవేటుకు అప్పగించారు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపేసిన వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి కోనసీమలో వివాదం సృష్టించారు. కులాల మధ్య చిచ్చు రేపడానికి జగన్‌ స్పాన్సర్‌షిప్‌ తీసుకున్నారు’ అని ఆరోపించారు.. స్పీకర్‌ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం మహానాడుపై చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు.