Begin typing your search above and press return to search.

టీడీపీ ఎవరినీ రాజ్యసభకు పంపకపోవడమేబెటర్

By:  Tupaki Desk   |   29 Oct 2015 6:45 AM GMT
టీడీపీ ఎవరినీ రాజ్యసభకు పంపకపోవడమేబెటర్
X
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యత్వాలు అచ్చి వస్తున్నట్లు లేవు.. ఆ పార్టీని వీడుతున్న నేతల్లో ఎమ్మెల్యేలు - లోక్ సభ ఎంపీలు కంటే రాజ్యసభ సభ్యులే ఎక్కువమంది ఉండడమే దీనికి కారణం. తెలంగాణాకు చెందిన వరంగల్ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అధికార తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయం తీసుకోవటంతో టిడిపిలో ఈ కోణంలో మరోసారి చర్చ మొదలైంది. పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక అయిన వారిలో అత్యధికులు టిడిపి కష్టకాలంలో ఉన్నపుడే పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపికై పదవి - అధికారం అనుభవించి చివరకు ఇతర పార్టీల్లోకి చేరిన నేతల జాబితా పెద్దదే. పర్వతనేని ఉపేంద్ర - రేణుకా చౌధరి - వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి - సి.రామచంద్రయ్య - వంగా గీత - మైసూరారెడ్డి - మోహన్ బాబు - జయప్రద - సోలిపేట రామచంద్రయ్య - యలమంచిలి శివాజీ - యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటివారంతా టీడీపీ రాజ్యసభ ఎంపీలుగా ఉంటూనే పార్టీని వీడారు. వీరిలో ఎక్కువమంది ఇతర పార్టీల్లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించగా, కొందరు మాత్రం రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇంకొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయాల్సిన కష్టం లేకుండా సునాయాసంగా ఎంపీలై ఆ తరువాత అవకాశమిచ్చిన పార్టీకే ఎసరు పెట్టడం కరెక్టు కాదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా గుండు సుధారాణి తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఇక రాజ్యసభ కు ఎవరినీ పంపించకపోవడమే బెటరని కొందరు ఆవేదనతో అంటున్నారు.