Begin typing your search above and press return to search.

చంద్రబాబు సభ తొక్కిసలాటకు అసలు కారణమిదేనా?

By:  Tupaki Desk   |   29 Dec 2022 5:21 AM GMT
చంద్రబాబు సభ తొక్కిసలాటకు అసలు కారణమిదేనా?
X
ఇదేం ఖర్మ పేరుతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు 8 మంది మరణించడానికి దారితీసిన కారణాలపై చర్చ జరుగుతోంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... 'ఇదేం ఖర్మ' కార్యక్రమంలో భాగంగా కందుకూరులోని స్థానిక ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ఈ సర్కిల్‌ రోడ్లు కాస్త ఇరుగ్గా ఉంటాయని అంటున్నారు. సర్కిల్‌ నుంచి గుండంకట్ట వెళ్లే రోడ్డు అన్నిటికన్నా ఇరుగ్గా ఉందని చెబుతున్నారు. దాంట్లోనే అటూ ఇటూ ఫ్లెక్సీలు పెట్టడంతో 30 అడుగుల వెడల్పు రోడ్డు కాస్తా చిన్న సందులా తయారయిందని పేర్కొంటున్నారు.

అక్కడే మురికి కాలువ పక్కన వరసగా కొందరు బైక్‌లు పార్క్‌ చేశారు. అలాగే ఓ తోపుడు బండి, టీవీ ప్రసారాల లైవ్‌ వెహికల్‌ కూడా ఉండటంతో... కొందరు లైవ్‌ వెహికల్‌ ఎక్కారు. మరికొందరు బైకులు పట్టుకుని నిల్చున్నారు. మరికొంతమంది కింద నిలబడటానికి జాగా లేకపోవడంతో అక్కడే ఉన్న ఒక రేకుల షెడ్డుపైకి ఎక్కారు.

ఇంతలోనే చంద్రబాబు కాన్వాయ్‌ భారీ వాహన ర్యాలీతో సభా స్థలికి చేరుకుంది. దీంతో ఆయనను చూడటానికి జనాలు ఎగబడ్డారు. ఒక్కసారిగా వాహనాలు రావడంతో ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ మధ్య తన ప్రసంగ వాహనాన్ని నిలపాల్సిన చంద్రబాబు కొంచెం ముందుకు వెళ్లి సందులో నిలిపారు. దాంతో ఈ నాలుగు రోడ్ల కూడలి కాస్త మరింత ఇరుగ్గా మారిపోయిందని అంటున్నారు.

ఇది గమనించిన చంద్రబాబు తన ప్రసంగం ప్రారంభించబోతూ.... గుండంకట్ట రోడ్డులో ఉన్న లైవ్‌ వెహికల్‌ ఎక్కిన వారిని దిగిపోవాలని అభ్యర్థించారు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు వాళ్లందరినీ దిగాలంటూ పదే పదే కేకలు వేశారు.

అదే సమయంలో చంద్రబాబు ప్రసంగ వాహనానికి వెనుక వైపు ఉన్న వారు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకురావడంతో మరింత గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. అంతా ముందుకు రావటంతో గుండంకట్ట రోడ్డులో తోపులాట మొదలై తోపుడు బండి తిరగబడిపోయింది. బైకులపై పడింది. బైకులన్నీ వరసగా కిందికి పడిపోవటంతో... వాటిని ఆనుకుని ఉన్న కొందరు జనం కూడా అదుపు తప్పి బైకుల కింద, పక్కనున్న కాలువలోను పడిపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భయపడినవారు గట్టిగా కేకలేస్తూ లేవడానికి ప్రయత్నించారు.

అయితే ఆ అరుపులతో మరింత మంది కంగారుపడ్డారు. ఇదే సమయంలో దానికి సమీపంలోనే రేకుల షెడ్డు ఎక్కినవారు అది విరగడంతో కింద వెళ్తున్నవారిపై పడ్డారు. దీంతో అంతా భయభ్రాంతులై ఏదో జరిగిపోతోందనుకుని పరుగులు పెట్టారు. దీంతో ఆ కంగారులో కిందపడ్డవారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లిపోవటానికి ప్రయత్నించారు.

దీంతో కిందపడినవారిలో చాలామంది ఊపిరాడక లేవలేకపోయారు. ఫలితంగా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఎనిమిది మందికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొందరు పోలీసులు, స్థానికులు, తోటి కార్యకర్తలు తక్షణం స్పందించడంతో ప్రమాద బాధితుల సంఖ్య పెరగలేదని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.