Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో టీడీపీ సీటు కమ్మలకా.. కాపులకా?

By:  Tupaki Desk   |   24 Oct 2022 6:47 AM GMT
కీలక నియోజకవర్గంలో టీడీపీ సీటు కమ్మలకా.. కాపులకా?
X
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 19 ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ 2019లో కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇందులో పెద్దాపురం ఒకటి. ఇక్కడి నుంచి నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. 2014లో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప తొలిసారి పెద్దాపురం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. గెలిచిన మొదటిసారే చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖ మంత్రిగా చాన్సు కొట్టేశారు.

ఇక వైసీపీ ప్రభంజనం వీచిని 2019లోనూ నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురంలో గెలిచి సంచలనం నమోదు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు.

అయితే మరోవైపు పెద్దాపురం నుంచి బొడ్డు భాస్కర రామారావు, చంద్రమౌళి వంటి కమ్మ సామాజికవర్గ నేతలు కూడా ఉన్నారు. ఈసారి పెద్దాపురం సీటును కమ్మ సామాజికవర్గానికే ఇవ్వాలని వీరు టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల పెద్దాపురం టీడీపీ నియోజకవర్గ కమ్మ నేతలంతా వచ్చే ఎన్నికల్లో సీటును కమ్మ సామాజికవర్గానికే ఇవ్వాలని చంద్రబాబుకు విన్నవించినట్టు ప్రచారం జరుగుతోంది.

కాగా గతంలో పెద్దాపురం నుంచి బొడ్డు భాస్కర రామారావు విజయం సాధించడం గమనార్హం. 1994, 1999ల్లో ఆయన టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌ గాలి వీచిన 2004లోనూ, 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలోనూ బొడ్డు భాస్కర రామారావు ఓడిపోయారు.

వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతోపాటు ఇతర కారణాలతో చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వలేదు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీగా బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం కూడా ముగిసింది.

దీంతో 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని బొడ్డు భాస్కర రామారావు ఆశిస్తున్నారు. అందుకే చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కమ్మ సామాజికవర్గానికే ఈ సీటు కేటాయించాలని కమ్మ కులానికే చెందిన నేతలతో లాబీయింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.