Begin typing your search above and press return to search.

ప‌ట్టు కోల్పోతున్న టీడీపీ సీనియ‌ర్ ఫ్యామిలీ..!

By:  Tupaki Desk   |   6 July 2021 3:57 AM GMT
ప‌ట్టు కోల్పోతున్న టీడీపీ సీనియ‌ర్ ఫ్యామిలీ..!
X
క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నానాటికీ బ‌ల‌హీన‌ప‌డుతోంది. సీనియ‌ర్ నేత‌లు ఇప్ప‌టికే చాలా మంది రిటైర్ కావ‌డం.. మ‌రికొంద‌రు అధికార పార్టీ నేత‌ల‌తో లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుని వ్యాపారాలు సాగిస్తుండ‌డంతో.. టీడీపీని ప‌ట్టించుకునే నాథుడు క‌నిపించ‌డం లేదు. ఇంకొంద‌రు.. త‌మ‌పై ఉన్న‌కేసుల‌కు భ‌య‌ప‌డో.. లేక కొత్త‌గా కేసులు పెడ‌తార‌ని భావించో.. అస‌లు టీడీపీ కార్య‌క్ర‌మాలు, నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వాటిలో ఇప్పుడు డోన్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ముఖంగా క‌నిపిస్తోంది.

2009 ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేసిన సీనియ‌ర్ నాయ‌కుడు కేఈ కృష్ణ‌మూర్తి ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. దీనికి ముందు 1999లో కేఈ ప్ర‌భాక‌ర్ గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఏర్ప‌డింద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. ఈ కేడ‌ర్‌ను నిల‌బెట్టుకోవ‌డంలో కేఈ కుటుంబం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ పూర్తిగా ఇక్క‌డ చ‌తికిల ప‌డింది. ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ కేఈ కుటుంబ‌మే ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఆశించిన ఫ‌లితాన్ని మాత్రం రాబ‌ట్టుకోలేక పోయింది.

2014, 2019 ఎన్నికల్లో కేఈ ప్ర‌తాప్ ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌ళ్లీ ఇటీవ‌ల పుంజుకున్నాన‌ని.. పార్టీని నిల‌బెడ‌తాన‌ని ప్ర‌క‌టించినా.. ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకునిమంత్రిగా చ‌క్రం తిప్పుతున్న బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ను ఢీ కొట్టి.. వ‌చ్చేఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే.. టీడీపీ తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గ‌న భారీ ఎత్తున నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు కేటాయించుకుని.. అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో బుగ్గ‌న‌కు మ‌రింత సానుభూతి, అభిమానులు పెరుగుతున్నారు. పైగా గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న 35 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు..ఇది మ‌రింత పెరుగుతుంద‌ని.. దీనిని గుర్తించి టీడీపీ నేత‌లు త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకోవాల‌ని.. విశ్లేష‌కులు సూచిస్తున్నారు. అయితే.. ఆదిశ‌గా టీడీపీ నేతలు ఎక్క‌డా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎప్పుడో గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు మీడియా ముందుకువచ్చి.. నాలుగు కామెంట్లు విస‌ర‌డం త‌ప్ప‌.. కేఈ ప్ర‌తాప్ ఏమీ చేయ‌లేక పోతున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.