Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకోర్టు లో ఊరట..!

By:  Tupaki Desk   |   4 Aug 2021 6:32 AM GMT
మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకోర్టు లో ఊరట..!
X
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు పెట్టి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం ఉదయం ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా,దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజుల పాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు.

అయితే తనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తున్నందునే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిందని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన న్యాయస్థానం దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది. కొండూరు లో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు. ఆయన అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించి.. ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే.. దేవినేని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా మైలవరంలో మైనింగ్ వివాదం గత కొన్ని రోజులుగా రచ్చ రాజేసింది. ఈ విషయంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కాస్త ప్రత్యక్ష దాడి వరకూ వెళ్లింది.

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం దేవినేని ఉమ వెళ్లగా జి.కొండూరు ప్రాంతంలో ఉద్రిక్త‌తలు చెల‌రేగాయ‌ని చెబుతూ పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. హైకోర్టును ఆశ్రయించ‌డంతో బెయిల్ వ‌చ్చింది.