Begin typing your search above and press return to search.

ఓడినా ఎమ్మెల్యేనంటున్న గాలి ముద్దుకృష్ణ‌మ‌!

By:  Tupaki Desk   |   13 Oct 2017 12:07 PM GMT
ఓడినా ఎమ్మెల్యేనంటున్న గాలి ముద్దుకృష్ణ‌మ‌!
X
ఎంత సేపూ విప‌క్షంపై కారాలు - మిరియాలు నూరే టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తాజాగా త‌న సొంత పార్టీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. అదేస‌మ‌యంలో త‌న ఘ‌న‌త‌ను చాటుకున్నారు. తాను ఓడిపోయినా.. ఎమ్మెల్యేకంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, 2014 ఎన్నికల్లో తన ఓటమికి టీడీపీ నాయకులు - కార్యకర్తలే బాధ్యత వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోకపోయి ఉంటే.. మంత్రిని అయ్యేవాడినని చెప్పుకొచ్చారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో టీడీపీ అవ‌లంబిస్తున్న కార్య‌క్ర‌మాల‌తో పాటు.. తాను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో అమ‌లు చేసిన కార్య‌క్ర‌మాల‌నూ ప్ర‌చారం చేయాల‌ని గాలి కోర‌డం విశేషం. స్థానిక టీడీపీ నేత‌ల‌తో భేటీ అయిన ఆయ‌న ఇలాంటి సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

త‌న సేవలను నాయకులు - కార్యకర్తలు గుర్తించకపోవడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ నేతలు - కార్యకర్తలు ఎన్నికల సమయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఓటమిపాలైనట్టు గాలి చెప్పారు. తానేమిటో.. త‌న ప్ర‌వ‌ర్త‌న ఏమిటో అధినేత చంద్ర‌బాబుకు తెలుస‌న‌ని అన్నారు. తన సేవలను ఉపయోగించుకొనేందుకే గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచి ఉంటే మంత్రిని అయ్యేవాడినని అన్నారు. ఇప్పటి వరకు తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఒక ఎన్టీఆర్‌ ను తప్ప మిగతా సీఎంలందరిపైనా అసెంబ్లీలో తొడగొట్టి విమర్శలు చేశాన‌ని చెప్పుకొచ్చారు.

సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి వద్దకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వెళ్లి పేదలకు న్యాయం చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్‌ తీసుకువచ్చిన ఘనత తన‌దేన‌న్నారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబును ఒప్పించి జిల్లాలో 80 మందికి రూ.60 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌ తీసుకొచ్చానని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో 16 అంశాల్లో కుప్పం తరువాత నగరి రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. గృహ నిర్మాణంలో 6200 ఇళ్లు మంజూరు చేసుకొచ్చి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇంకా మరో వెయ్యి ఇళ్ళ మంజూరుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు.