Begin typing your search above and press return to search.

లైట్ తీస్కో : నో ఫోకస్...నో దూకుడు ?

By:  Tupaki Desk   |   14 April 2022 9:30 AM GMT
లైట్ తీస్కో :  నో ఫోకస్...నో దూకుడు ?
X
ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి రెండూ కావు. ఆ మధ్యన మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప దీని మీద చక్కగా చెప్పారు. తాము ఒక సమస్యను టేకప్ చేస్తూంటే మరో సమస్య వచ్చి పడుతోంది. గత మూడేళ్ళుగా తీసుకుంటే పరిస్థితి అలాగే ఉంది. ఒకదాన్ని మించి మరోటి అలా తామరతంపరగా సమస్యలు వెల్లువెత్తుతూంటే విపక్షం విశ్వరూపమే చూపించాలి.

కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తూతూ మంత్రంగా ఉద్యమాలు చేసి ఊరుకుంటోంది అన్న చర్చ అయితే మొదలైంది. నిజానికి టీడీపీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఆ పార్టీ వైపే జనాలు చూస్తారు. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న పార్టీ కూడా టీడీపీయే. అదే టైమ్ లో 22 ఏళ్ల పాటు అధికారంలోనూ, మిగిలిన కాలమంతా ప్రధాన విపక్షంగా టీడీపీ కీ రోల్ ప్లే చేస్తూ ఉంది.

అలాంటి టీడీపీ జగన్ టెన్యూర్ లో మాత్రం అనుకున్నంతగా దూకుడు చూపించలేకపోతుంది అన్నది విశ్లేషణగా ఉంది. జగన్ కుర్చీ ఎక్కిన మొదట్లోనే చంద్రబాబు ఆవేశపడి పోరాటాలు చేశారు. అవి అక్కసు ఆరాటాలుగా మారాయని జనాలు లైట్ తీసుకున్నారు. ఆ తరువాత కరోనా వచ్చి రెండేళ్ల పాటు ఊపేసింది.

దాంతో చంద్రబాబు పొరుగు రాష్ట్రాన, మిగిలిన నాయకులు ఇళ్ళకు పరిమితం అయ్యారు. కరోనా ఆరు నెలల నుంచి బాగా తగ్గిపోయింది. ఒక్కసారిగా జనాల‌లోకి వచ్చి ఉద్యమిస్తారు అనుకుంటున్నా చప్ప చప్పగానే పసుపు పార్టీ పోరాటాలు ఉంటున్నాయి. ఏ సమస్యను కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడం లేదు, తుదిదాకా నిలిచి తగిన పరిష్కారం కనుగొనడంలేదు.

ఆస్తి పన్ను నుంచి చెత్త పన్ను నుంచి మొదలుపెడితే అన్నీ అర్ధాంతరంగా ఆపేసిన పోరాటాలే. విద్యుత్ చార్జీల మీద గట్టిగా గర్జిస్తారు అనుకుంటే అది అలాగే ఉంది. ఇపుడు ఆర్టీసీ చార్జీల మీద యుద్ధం అంటున్నారు. దీని తరువాత మరో టాపిక్ ఇలా కచ్చితంగా గ్రౌండ్ లో నిలబడి కలబడే పరిస్థితి అయితే లేదు అనే అంటున్నారు.

ఇక్కడ టీడీపీ ఉద్యమాలు వీక్ కావడానికి కారణాలు ఉన్నాయి. ఇపుడు ఎన్నికలు లేవు కదా అంతా ఇపుడే ఎందుకు అని నాయకులు అలా ఒకసారి బయటకు వచ్చి జారుకుంటున్నారు. అధినాయకత్వం కూడా ప్రజా పోరాటాల కంటే రాజకీయ వ్యూహాలనే ఎక్కువగా నమ్ముకుంటోంది. వైసీపీలో అసమ్మతి చెలరేగితే సొమ్ము చేసుకోవాలని, లేకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు వస్తే తాను అందుకోవాలని ఆలోచిస్తోంది.

ఇక ఎటూ 2024 ఎన్నికలల్లో వైసీపీ మీద విరక్తితో తమకే జనాలు ఎటూ గెలిపిస్తారు, తమకు అపోజిషన్ లో పెద్దగా పోటీ లేదని కూడా భావించడం వల్ల ఉద్యమాల మీద దృష్టి పెట్టడంలేదు అంటున్నారు. దాంతో జనాల సమస్యలకు గొంతు కలిపి ఎదుట నిలిచే నాయకుడు అయితే లేకుండా పోతున్నారు. అలా అధికార పార్టీ చేసే చాలా తప్పులు ఒప్పు అయిపోతున్నాయి.

మరి జనాల్లో లేకుండా గాలిలో మేడలు కడుతూ యాంటీ ఇంకెంబెన్సీని నమ్ముకుంటే రాజకీయ కధ పండుతుందా. 2024లో కచ్చితంగా తమదే విజయం అని అతి నమ్మకం పెట్టుకోవచ్చా. మొత్తానికి అటు ఫోకస్ లేదు, ఇటు దూకుడు లేదు, ఎందుకంత వీక్ అని జనాల్లో చర్చ అయితే సాగుతోంది మరి. ఇక్కడో మాట అధికార పక్షం ఫెయిల్యూర్స్ నే కాదు, విపక్షం విఫలతత్వాన్ని కూడా జనాలు జాగ్రత్తగా గమనిస్తారు. తస్మాత్ జాగ్రత్త.