Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్' నాటు పాట ను అలా వాడేసిన టీడీపీ సీనియర్ నేత

By:  Tupaki Desk   |   14 Dec 2021 5:33 AM GMT
ఆర్ఆర్ఆర్  నాటు పాట  ను అలా వాడేసిన టీడీపీ సీనియర్ నేత
X
గతానికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఎవరినైనా విమర్శించాలంటే అందుకు అనుసరించే పద్దతులు మారిపోయాయి. అప్పట్లో ఉండే మీడియాకు వంద రెట్లు బలమైన సోషల్ మీడియా వచ్చేయటం.. అందరికి అందుబాటులోకి రావటం తెలిసిందే. ఘాటు పదాలతో విమర్శలు.. ఆరోపణలు చేసే కన్నా.. తెలివిగా పంచ్ లు వేసే ఏ అవకాశాన్ని ఎవరూ వదులుకోవటం లేదు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

సినీ ప్రపంచంలో పెను సంచలనంగా.. అత్యధిక ఆసక్తి వ్యక్తమవుతున్న మూవీ.. రాజమౌళి తాజా శిల్పం.. ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది రెండో వారంలో విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు అలా ఇలా అన్నట్లు లేవు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయటం.. ఆ సందర్భంగా వచ్చిన బజ్ చూసినోళ్లు.. ఈ సినిమా ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. తారక్.. చెర్రీలు పోటాపోటీగా నటించిన ఈ మూవీలోని ఒక నాటు పాట.. రాజకీయ నేతలకు ఆయుధంగా మారటం ఆసక్తికరంగా మారింది.

‘నా పాట సూడు’ అంటూ తారక్.. చెర్రీలు చేసిన నాటు పాటకు పేరడీని విడుదల చేశారు బుచ్చయ్య చౌదరి. ఏపీలోని జగన్ సర్కారు తీరును తప్పు పడుతూ.. ఈ పాటకు పేరడీ పాటను విడుదల చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అప్పులోళ్ల ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్లు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజుఊగినట్లు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండ ఎక్కించినట్టు.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. సుద్ధ వేసటు అంటూ సాగేలా పాటను మార్చిన వైనాన్ని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. ఇక.. మిగిలింది.. పుష్పలోని సమంత చేసిన ఐటెం సాంగేనేమో?