Begin typing your search above and press return to search.

అభ్యర్థుల ఎంపికలో లోకేష్ జోక్యం.. సీనియర్ల రుసరుస!

By:  Tupaki Desk   |   12 March 2019 1:30 AM GMT
అభ్యర్థుల ఎంపికలో లోకేష్ జోక్యం.. సీనియర్ల రుసరుస!
X
తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో నారా లోకేష్ బాబు జోక్యం ఆ పార్టీలో సీనియర్లను ఇబ్బందుల పాల్జేస్తూ ఉందని ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా తెర వెనుక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు నారా లోకేష్ బాబు. ఈ పరిణామాల మధ్యన పార్టీలోని సీనియర్ నేతలు రుసరుసలాడుగుతున్నట్టుగా సమాచారం.

నారా లోకేష్ బాబు అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకొంటూ ఉండటంతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూడా చిన్నబోతూ ఉన్నాయని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పలువురు నేతలకు టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వగా.. అయితే లోకేష్ కొత్త వాళ్లను తెరమీదకు తెస్తున్న నేపథ్యంలో.. పాత వాళ్లకు ఝలక్ తప్పడం లేదని ప్రచారం జరుగుతూ ఉంది.

ఆఖరికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మురళీమోహన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే.. అందుకు కారణం నారా లోకేష్ బాబే అని అంటున్నారు. రాజమండ్రి ఎంపీ టికెట్ విషయంలో ఒక వ్యాపారవేత్త భారీగా సొమ్ములు ఆఫర్ చేశారని, సూట్ కేసుల కొద్దీ డబ్బులు ఆఫర్ చేశారని.. దీంతో మురళీ మోహన్ తప్పుకోవాల్సి వస్తోందని అనుకుంటున్నారు. మురళీ మోహన్ దగ్గర డబ్బులు లేదని కాదు.. తన టీమ్ ఉండాలనేది లోకేష్ లెక్కగా ప్రచారం జరుగుతోంది. అందులో కూడా ధనికులు, వందల కోట్ల రూపాయలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్లే చర్చించుకొంటూ, ఆఫ్ ద రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు.

కేవలం రాజమండ్రి కథే కాదు.. కొంతమంది సీనియర్లకు కూడా చంద్రబాబు నాయుడు టికెట్ ఆఫర్ చేయగా, లోకేష్ జోక్యం చేసుకుని వారిని లైన్ నుంచి తప్పించారని తెలుగుదేశం వర్గాలు అనుకుంటున్నాయి. సీనియర్ పొలిటీషియన్ డీఎల్ రవీంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు మైదుకూరు టికెట్ విషయంలో మొదట హామీ ఇచ్చారట. అయితే దానికి లోకేష్ నో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.

మైదుకూరు లో పుట్టా సుధాకర్ యాదవ్ అయితే.. డబ్బులు బాగా ఖర్చు పెడతారనేది లోకేష్ లెక్కేనట. మైదుకూరు టికెట్ విషయంలో బాబు డీఎల్ వైపు మొగ్గుచూపినా లోకేష్ మాత్రం సుధాకర్ యాదవ్ కే ప్రాధాన్యతను ఇచ్చారట.

ఇక కడప జిల్లాకే సంబంధించి ప్రొద్దుటూరు టికెట్ విషయంలో కూడా లోకేష్ జోక్యం కథను మార్చేసిందని సమాచారం. ఇక్కడ ఇన్నాళ్లూ టీడీపీలో పని చేసిన వారిని కాకుండా.. డబ్బులు దండిగా ఉన్నాయనే లెక్కతో వీరశివారెడ్డికి లోకేష్ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారని కడప జిల్లా టీడీపీ వర్గాలు గొణుక్కొంటున్నాయి!