Begin typing your search above and press return to search.

లోకేషూ... ఇదేమి తీరూ...

By:  Tupaki Desk   |   17 Aug 2018 5:51 AM GMT
లోకేషూ... ఇదేమి తీరూ...
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు - ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ పై పార్టీలో - ప్రభుత్వంలో అసమ్మతి చెలదేగుతున్నట్లు సమాచారం. ఆయన ఎమ్మెల్సీ - మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచీ కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి కె.ఇ. క్రష్ణమూర్తి - ఆర్ధిక‌ మంత్రి యనమల రామక్రిష్ణుడు - విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసు వంటి వారు లోకేష్‌ పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇన్నాళ్లు మింగలేక - కక్కలేక మౌనంగా ఉన్న నాయకులకు పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ‌్ తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు - మంత్రి కె. తారక రామారావుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు - మంత్రి నారా లోకేష్‌ ను పోలుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్‌ తో పోలిస్తే నారా లోకేష్‌ కు రాజకీయ - ఉద్యమ నేపధ్యం లేదని అన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కూడా కాదని - తన తండ్రిని అడ్డం పెట్టుకుని మంత్రి అయినా నారా లోకేష్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు.

ప్రజలతో కనీస సంబంధాలు కూడా లేవని - అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడని నిలదీసారు. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీనియర్లకు విమర్శనాస్త్రం దొరికినట్లు అయ్యింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని లోకేష్‌ పై వారు బాణాలను ఎక్కుపెట్టేందుకు సన్నద్దమవుతున్నట్టు సమాచారం. తాను భీమిలిలో గెలవనని ఓ పత్రికలో సర్వే పేరుతో ప్రచారం చేయించింది లోకేషేనని గంటా శ్రీనివాస రావు తమ సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. చిరంజీవి సోదరుడైన పవన్ కల్యాణ్‌ కు - గంటాకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో పవన్ వ్యాఖ్యలు వెనుక గంటా ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా రాజకీయాలలోకి లోకేష్ ప్రవేశించడం - అభ్యర్దులను ప్రకటించడం ఆ జిల్లాకు చెందని సీనియర్‌ నాయకుడు కె.ఇ. క్రిష్ణమూర్తికి నచ్చలేదట. ఉపముఖ్యమంత్రిని - పార్టీలో సీనియర్‌ అయిన తనని కాదని - కనీసం సంప్రదించడం కూడా చేయాకుండా లోకేష్ అభ్యర్దులను ప్రకటించడం పట్ల ఆయన అసంత్రుప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని కె.ఇ. క్రిష్ణమూర్తిని బుజ్జగించారని సమాచారం. ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్దిక మంత్రి యనమల రామక్రిష్ణుడు కూడా లోకేష్‌ పై చంద్రబాబుకు సుతిమెత్తని ఫిర్యాదు చేసారని పార్టీలో చర్చించుకుంటున్నట్లు తెలిసింది. తన శాఖకు సంబంధించి లోకేష్ తలదూరుస్తున్నారని, ఆర్దిక శాఖ అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారని యనమల ఫిర్యాదుగా చెబుతున్నారు. మొత్తానికి చిన్నబాబు వైఖరిపై చంద్రబాబుకు ఫిర్యాదులు వస్తున్నట్లుగా అమరావతిలో జోరుగా ప్రచారం జరుగుతోంది.