Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు వీక్‌ నెస్‌.. వారికి క్యాష్ అవుతోందా?

By:  Tupaki Desk   |   29 March 2021 7:30 AM GMT
చంద్ర‌బాబు వీక్‌ నెస్‌.. వారికి క్యాష్ అవుతోందా?
X
ఒక పార్టీ ప్ర‌జ‌ల్లో నిల‌వాలంటే.. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? వారికి మ‌నం ఏం చేస్తున్నాం.. అనే విష‌యంపై నిశిత అవ‌గాహ‌న ముఖ్యం. ఈ త‌ర‌హా ఆలోచన చేయ‌గ‌లిగి కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎక్క‌డో విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. ఇటీవ‌లి ప‌రిణామాలు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిస్తితిని గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు వీక్‌నెస్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న వీక్‌నెస్‌ను కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. పార్టీలో చ‌క్రం తిప్పుతూ.. త‌మ స్వ‌లాభం చూసుకుంటున్నారే త‌ప్ప‌.. పార్టీ కోసం ఏమీ చేయ‌డం లేద‌నే వాద‌న కూడా తోడైంది. వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళ‌న ఉంటుంద‌ని అంద‌రూ భావించారు.

ఈ దిశ‌గా చంద్ర‌బాబు సైతం సంకేతాలు పంపించారు. ఫ‌లితంగా పార్టీలో స‌మూల మార్పులు ఖాయ‌మ‌ని.. పార్టీ పుంజుకుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఏమైందో ఏమో.. మ‌ళ్లీ చంద్ర‌బాబు త‌న ప‌ద్ధతినే కొన‌సాగించారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పార్టీలో నాలుగు ద‌శాబ్దాలుగా ఉన్న‌వారికి.. ప్ర‌జ‌ల్లో ఫేడ్ అవుట్ అయిన నేత‌ల‌ను ఇప్ప‌టికీ కీల‌క ప‌ద‌వుల్లో కూర్చోబెట్ట‌డ‌మే. ఈ త‌ర‌హా ప‌రిస్తితి అధికార వైసీపీలో క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ ప‌రిస్థితుల‌ను అవ‌గాహ‌న చేసుకుని.. ప్ర‌జ‌లు మెచ్చే విధంగానే వైసీపీని న‌డిపించేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా తాను బ‌లంగా ఉంటూ.. పార్టీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. ఈ విష‌యం కూడా చంద్ర‌బాబుకు తెలుసు. అయిన‌ప్ప‌టికీ.. ``ఆయ‌నకు గ‌తంలో కొంద‌రు సాయం చేశార‌నే`` ఏకైక ఉద్దేశంతో ఇప్ప‌టికీ వారిని మోస్తున్నారు.

కానీ, ఈ `సాయం` విష‌యంలో జ‌గ‌న్ విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అనే విష‌యాల‌ను పాటించారా? లేదా? అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న పెడితే.. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీని పున‌రుత్తేజం చేసుకునేందుకు త‌న‌కు వీలుగా ఉన్న‌వారికి మాత్ర‌మే అంద‌లం అందిస్తున్నారు. దీనికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఎంతో మందికి ప‌ద‌వులు ఇస్తాన‌ని చెప్పి కూడా ఇవ్వ‌లేదు. దీనిపై అంత‌ర్గ‌తంగా ర‌చ్చ జ‌రుగుతున్నా.. పార్టీని కానీ.. ప్ర‌జ‌ల్లో పార్టీపై ఉన్న అభిమానాన్ని కానీ.. ఈ త‌ర‌హా మైన‌స్‌లు ఏమీ చేయ‌లేక‌పోతున్నాయి. కానీ, ఇదే త‌ర‌హా వ్యూహాలు వేసి.. ఫేడ్ అవుట్ అయిన వారిని.. త‌న‌కు అప్పుడెప్పుడో సాయం చేసిన వారిని ప‌క్క‌న పెట్టి.. కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డంలోను, కొత్త‌గా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు చంద్ర‌బాబు సాహ‌సం చేయ‌లేక పోతున్నారు.

ఈ వీక్‌నెస్ ఆ `కొంద‌రికి` వ‌రంగా మారింది. ఫ‌లితంగా ముప్పై, న‌ల‌భై ఏళ్లుగా జిల్లాల్లో పాతుకు పోయిన వారు.. పార్టీలో చ‌క్రం తిప్పుతున్న వారే ఇప్ప‌టికీ క‌నిపిస్తున్నారు. కానీ, వీరివ‌ల్లే ఇప్పుడు టీడీపీ భ్ర‌ష్టు ప‌డుతోంద‌న్న‌ది ఎవ‌రు ఒప్పుకొన్నా.. ఒప్పుకోక పోయినా.. వాస్త‌వం. కానీ.. బాబు మాత్రం త‌న పంథాను వీడ‌డం లేదు. మ‌రి ఇలానే ఉంటే.. పార్టీ ప‌రిస్థితి ఏమ‌వుతుందో ఎవ‌రికీ అంత‌ప‌ట్ట‌ని స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌జ‌ల్లో మార్పు వ‌చ్చి.. అధికారం ఇస్తార‌ని అనుకుంటున్నారే త‌ప్ప‌.. తాను మారి.. పార్టీని మార్చి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నే వ్యూహం మాత్రం కొర‌వ‌డింద‌నేది ప‌చ్చి నిజం!