Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబే కాదు.. టీడీపీ నేత‌లంద‌రి ప‌రిస్థితీ అదే!

By:  Tupaki Desk   |   20 Sep 2021 10:37 AM GMT
చంద్ర‌బాబే కాదు.. టీడీపీ నేత‌లంద‌రి ప‌రిస్థితీ అదే!
X
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోనే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాట‌లేక‌పోయిన నేప‌థ్యంలో.. టీడీపీ మ‌హామ‌హుల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ ఫెయిల్యూర్ స్టోరీ మ‌రుగున‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ టీడీపీనే స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది.

చివ‌రిసారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కూడా కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు చేసుకుంది. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఆ పార్టీకి కంచుకోట‌లు అనుకున్న చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ‌వా సాగ‌డం విశేషం.

వీటిల్లో బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం, ప‌రిటాల కుటుంబం ఓడిన రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం, తాడిప‌త్రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, ప‌య్యావుల కేశ‌వ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉర‌వ‌కొండ వంటి నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చోట్ల కూడా టీడీపీ చిత్త‌య్యింది.

అదేమంటే తాము బ‌హిష్క‌రించిన‌ట్టుగా టీడీపీ నేత‌లు చెప్పుకోవ‌చ్చు. అయితే టీడీపీ బ‌హిష్క‌ర‌ణ అంటూ ప్ర‌క‌టించినా బ్యాలెట్ పేప‌ర్లో సైకిల్ గుర్తు ఉంది. అలాగే పోటీ చేసిన వారు కొంద‌రు ఆశావ‌హులుగా ప్ర‌చారం చేసుకున్నారు. ఎవ‌రి ఆశ‌లు వారికి ఉండే ఉంటాయి క‌దా. బ‌హిష్క‌ర‌ణ పేరుతో కొంత‌మంది మాజీ ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు ప్ర‌చారానికి, ఖ‌ర్చుకు మొహం చాటేశారంతే. మిగ‌తాదంతా జ‌ర‌గాల్సిన‌ట్టుగానే జ‌రిగింది.

తాడిప‌త్రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఆ మ‌ధ్య మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అక్క‌డ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హ‌వా సాగింది. ఎలాగోలా మున్సిప‌ల్ పీఠాన్ని వారు సొంతం చేసుకున్నారు. అయితే.. రూర‌ల్ ఓట్లు ప్ర‌భావం చూపే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ల విష‌యంలో మాత్రం మ‌ళ్ళీ పాత‌క‌థే రిపీట్ అయ్యింది. త‌మ ప‌ట్టు టౌన్ వ‌ర‌కే అని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి నిరూపించుకున్న‌ట్టుగా అయ్యింది. మున్సిపాలిటీలో విజ‌యం సాధించినా, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల్లో మాత్రం స‌త్తా చూపించ‌లేక‌పోయారు. ఇక ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డే య‌న‌మ‌ల‌, నిమ్మ‌ల‌రామానాయుడు వంటివాళ్ల సొంత నియోజ‌క‌వర్గాలు, ఊర్ల‌లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.