Begin typing your search above and press return to search.

అక్కడ టీడీపీ అంతా అస్సామేనా...!

By:  Tupaki Desk   |   31 Oct 2021 7:30 AM GMT
అక్కడ టీడీపీ అంతా అస్సామేనా...!
X
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి..రెండున్నర ఏళ్ళు అయిపోతుంది. మరి ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా ? పార్టీల బలాబలాల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా ? అంటే వచ్చాయనే చెప్పాలి. కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది..అలాగే ఇంకొన్ని చోట్ల టీడీపీ వేగంగా పుంజుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వ‌న్‌సైడ్‌గా ఓట్లేసిన కొన్ని సామాజిక వ‌ర్గాల్లో ఇప్పుడు మార్పు క‌నిపిస్తోంది. గోదావ‌రి జిల్లాలు, ఉత్త‌రాంధ్ర‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మార్పులు వ‌స్తున్నాయి. ఎక్కడ ఎలా ఉన్నా సరే కడప జిల్లాలో మాత్రం టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగ‌జారిపోతూ వ‌స్తోంది.

ఈ రెండున్న‌రేళ్ల‌లో ఇక్కడ పార్టీ ఏ మాత్రం బలపడినట్లు కనిపించడం లేదు. మామూలుగానే జిల్లా వైసీపీకి కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో జిల్లాలో మొత్తం సీట్లు వైసీపీ వశం అయ్యాయి. అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ బలం తగ్గలేదు. కాకపోతే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. కానీ అదే సమయంలో ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అస‌లు టీడీపీ ఇన్‌చార్జ్‌ల‌నే పెట్ట‌లేని ప‌రిస్థితి.

జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి...దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఏదో ఒక్క మైదుకూరులో మాత్రం కాస్త టీడీపీకి అనుకూలంగా ఉంది. అక్కడే పార్టీ కాస్త పికప్ అయినట్లు కనిపిస్తోంది. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కాస్త స్ట్రాంగ్ అయ్యారు. ఇక మిగిలిన నియోజకవర్గాల గురించి చెప్పుకోవ‌డానికేం లేదు. కడప, బద్వేలు, పులివెందుల, ప్రోద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో టీడీపీ ఏ మాత్రం బలపడినట్లు కనిపించడం లేదు.

జిల్లాలో క‌డ‌ప‌, రాజంపేట రెండు ఎంపీ సీట్లు ఉంటే ఇక్క‌డ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు గెల‌వడం సంగ‌తి అలా ఉంచితే బ‌ల‌మైన క్యాండెట్ల‌ను పోటీ పెట్ట‌లేని ప‌రిస్థితి. అసలు కడపలో టీడీపీకి వ‌చ్చే ప‌దేళ్ల‌లో అయినా పిక‌ప్ అవుతుందా ? అంటే అన్నీ సందేహాలే..! ఇక వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి బాబు ఇక్క‌డ ఎంత క‌ష్ట‌ప‌డినా ఒక‌టి, రెండు సీట్లు వ‌స్తేనే గొప్ప‌..!