Begin typing your search above and press return to search.

ఈసీకి టీడీపీ పోటీ ఫిర్యాదు.. రీపోలింగ్ డిమాండ్!

By:  Tupaki Desk   |   17 May 2019 10:50 AM GMT
ఈసీకి టీడీపీ పోటీ ఫిర్యాదు.. రీపోలింగ్ డిమాండ్!
X
చంద్రగిరిలో రీ పోలింగ్ కు ఆదేశాలు వచ్చే సరికి తెలుగుదేశం పార్టీకి బాగా అసహనంతో ఉంది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ పై ఏకంగా ఢిల్లీ వరకూ వెళ్లి చంద్రబాబు నాయుడు నిరసన ప్రదర్శనకు రెడీ అవుతుండటం విశేషం. ఈ అంశం మీద వివిధ పార్టీ ల అధినేతలను కూడా కలవనున్నారట చంద్రబాబు నాయుడు.

మరీ ఐదు పోలింగ్ బూత్ ల విషయంలో చంద్రబాబు నాయుడు ఇంత పోరాటం చేస్తున్నారంటే ఈ అంశాన్ని టీడీపీ ఎంత సీరియస్ గా తీసుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అంతటితో ఆగడం లేదు. చంద్రగిరిలో రీ పోలింగ్ కు ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో తెలుగుదేశం వారు ఈ జాబితాలోకి మరిన్ని బూత్ లను చేర్చాలని అంటున్నారు. ఏపీలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ ల పేర్ల జాబితాను ఈసీ కి తెలుగుదేశం వారు అందించారు.

వాటిల్లో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు! అలా తెలుగుదేశం పార్టీ వాళ్లు సమర్పించిన జాబితాలో రాజంపేట - నరసరావు పేట - సత్తెనపల్లి - జమ్మలమడుగు వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ లు ఉన్నాయి. వాటిల్లో కూడా రీ పోలింగ్ కావాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.

మొత్తం పదిహేడు బూత్ లలో రీ పోలింగ్ కావాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రగిరిలో రీ పోలింగ్ కు ఈసీ ఆదేశాలు జారీ చేశాకా తెలుగుదేశం పార్టీ ఈ ఫిర్యాదును చేయడం విశేషం. ఈ అంశం మీద ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. చివరి దశ పోలింగ్ కు మరో రోజు మాత్రమే వ్యవధి ఉంది. ఆదివారమే పోలింగ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇలా ఆఖరి నిమిషంలో టీడీపీ ఫిర్యాదును ఈసీ ఎలా పరిగణిస్తుందో!