Begin typing your search above and press return to search.

బీజేపీ పై టీడీపీ స్టాండ్ మారుతోందా ?

By:  Tupaki Desk   |   29 Dec 2021 5:33 AM GMT
బీజేపీ పై టీడీపీ స్టాండ్ మారుతోందా ?
X
ప్రసన్నం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా, ఎంతకాలం వెయిట్ చేసినా ఉపయోగం ఉండదని చంద్రబాబునాయుడుకు అర్ధమైపోయిందా ? బీజేపీ విషయంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాగ్రహ సభ జరిగిన విషయం తెలిసిందే. ఆ సభ గురించి పయ్యావుల మాట్లాడుతూ అది ప్రజాగ్రహ సభ కాదని జగన్ అనుగ్రహ సభగా వర్ణించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ శాఖలు నరేంద్ర మోడీ, అమిత్ షా నెట్ వర్క్ లో పనిచేస్తుంటే ఏపీ బీజేపీ మాత్రం జగన్ నెట్ వర్క్ లో పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న బీజేపీ నేతలు ఎందుకు నోరెత్తటం లేదంటు నిలదీశారు. ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు నోరెత్తటం లేదంటు తీవ్రంగా ఆక్షేపించారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలబడాలని బీజేపీ నేతలకు అమిత్ షా చెప్పేంతవరకు తెలీదా ? అంటూ ఎద్దేవా చేశారు.

పయ్యావుల మాటలు విన్న తర్వాత బీజేపీ విషయంలో టీడీపీ స్టాండ్ మార్చుకుంటున్నదా ? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే టీడీపీలోని ఏ నేత కూడా బీజేపీని ఈ స్థాయిలో విమర్శించలేదు, ఆరోపణలు చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుండి మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నాలు లేవు. ఆ మధ్య జరిగిన మహానాడులో కేంద్ర ప్రభుత్వానికి భేషరతుగా మద్దతివ్వాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ మద్దతు కావాలని కేంద్రంలో ఎవరు అడగలేదు. నిజానికి టీడీపీ అవసరం కూడా నరేంద్ర మోడీ సర్కార్ కు లేనేలేదు. అయినా కానీ కేంద్రానికి మద్దతివ్వాలని తీర్మానం చేశారంటేనే చంద్రబాబు పరిస్ధితి అర్ధమైపోతోంది. అందుకనే బీజేపీ నేతలు చంద్రబాబును ఎంతగా విమర్శిస్తున్నా టీడీపీ నుండి బీజేపీ నేతలపై ఎలాంటి ప్రతి విమర్శలు ఉండటం లేదు.

దీనికి కారణం ఏమిటంటే తమతో పొత్తుకు బీజేపీ అంగీకరించకపోతుందా ? అనే చిన్న ఆశ. అయితే తాజాగా పయ్యావుల ఆరోపణలు, విమర్శలు విన్నతర్వాత అందరు ఆశ్చర్యపోతున్నారు. టీడీపీతో బేజేపీ పొత్తు పెట్టుకోదని తమ్ముళ్ళకు క్లారిటీ వచ్చినట్లుందనే ప్రచారం మొదలైంది. అందుకనే పయ్యావుల రెచ్చిపోయారేమో అని అనుమానాలు పెరిగిపోతున్నాయి.