Begin typing your search above and press return to search.

ఏపీలో తొలిసారి కాంగ్రెస్.. టీడీపీలు చెట్టాపట్టాల్

By:  Tupaki Desk   |   11 May 2016 7:02 AM GMT
ఏపీలో తొలిసారి కాంగ్రెస్.. టీడీపీలు చెట్టాపట్టాల్
X
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదన్న విషయం తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేస్తుంది. పరిస్థితులు.. పరిణామాలతో చిత్ర విచిత్రమైన కాంబినేషన్లు రాజకీయాల్లో చోటుచేసుకుటాయి. కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలు ఎంత వైరుధ్యమైనవి.. ఎంత బద్ధ శత్రువులన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటది.. ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలు వేసుకునే అరుదైన సన్నివేశం ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోనుంది.

తెలంగాణలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిణామాల నేపథ్యంలో.. అధికారపక్షానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాలన్న వ్యూహంలో భాగంగా తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలో కలిసి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకోనుండటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమకు శత్రువైన కాంగ్రెస్ తో కలవనున్న తెలుగుదేశం.. అదే సమయంలో తమకు మిత్రుడైన బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించటం మరో విశేషంగా చెప్పాలి.

ఇలాంటి చిత్రమైన కాంబినేషన్ కు కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశమే. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నఅంశంపై విభజన బిల్లులో మార్పుల్ని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లును పెట్టటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓటింగ్ ఈ నెల 13న జరగనుంది. ఈ బిల్లుకు తప్పనిసరిగా ఓటు వేసేందుకు వీలుగా ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విప్ జారీ చేయటం తిలిసిందే. ఈ ప్రైవేటు బిల్లు విషయంలో ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశం ఏటు వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు పలుకుతూ ఓటింగ్ లో పాల్గొనాలంటూ తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్రయోజనాలకు కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో తమ కమిట్ మెంట్ ను ప్రదర్శించుకునేందుకు ప్రైవేటు బిల్లును ఒక అవకాశంగా చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగర్భ శత్రువులుగా ఉండే రెండు పార్టీలు చెట్టాపట్టాలు వేసుకున్న చందంగా రాజ్యసభలో వ్యవహరించనున్నాయి. అయితే.. తమ మిత్రపక్షమైన తెలుగుదేశం.. తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రత్యేక హోదా అంశంపై ఓటు వేయటంపై మోడీ పరివారం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.