Begin typing your search above and press return to search.

కాకినాడ‌లో టీడీపీకి తొలి పంచ్ ప‌డిందిగా!

By:  Tupaki Desk   |   26 Aug 2017 7:13 AM GMT
కాకినాడ‌లో టీడీపీకి తొలి పంచ్ ప‌డిందిగా!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌లు ముగిశాయి. తీవ్ర ఉత్కంఠ రేపిన స‌ద‌రు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌క‌ముందే... ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టికే అటు అధికార టీడీపీతో పాటు ఆ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ - విప‌క్ష వైసీపీ అభ్య‌ర్థులు త‌మ త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు అక్క‌డ ప్ర‌చారం హోరెత్త‌నుంది. రేపు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాకినాడ ప్ర‌చారానికి వెళుతున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా కాకినాడ‌పై బాగానే దృష్టి పెట్టారు.

ఈ క్ర‌మంలో అస‌లు ఈ ఇద్ద‌రు నేత‌లు ఇంకా అక్క‌డ అడుగే పెట్ట‌లేదు... అధికార టీడీపీలో క‌ల‌క‌లం రేగిపోయింది. పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యాన్ని ధిక్క‌రించిన కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు... పార్టీ అధిష్ఠానం మిత్రప‌క్షం బీజేపీకి కేటాయించిన సీట్ల‌లోనూ నామినేష‌న్లు వేశారు. ఈ విష‌యం కాస్తా అధిష్ఠానం దృష్టికి వెళ్ల‌డం - ఆ వెంట‌నే స‌ద‌రు నామినేష‌న్లు వేసిన తెలుగు త‌మ్ముళ్ల‌ను వెనువెంట‌నే స‌స్పెండ్ చేస్తూ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. అస‌లు రెబెల్స్ భ‌యంతో విల‌విల్లాడుతున్న టీడీపీ కాకినాడ కార్పొరేష‌న్‌ ను గెలుచుకోవ‌డం క‌త్తి మీద సామేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లు అధిష్ఠానం మాట‌ను ధిక్క‌రించేసి మిత్ర‌ప‌క్షం బీజేపీకి కేటాయించిన సీట్ల‌లో తెలుగు త‌మ్ముళ్లు నామినేష‌న్లు వేయ‌డం పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. ఈ త‌ర‌హా వైఖ‌రికి ఇప్ప‌టికిప్పుడు చెక్ పెట్ట‌క‌పోతే... మున్ముందు టీడీపీ పెను ఇబ్బందుల‌ను ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

అయినా అక్క‌డ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్క‌రించి నామినేష‌న్లు వేసిన తెలుగు త‌మ్ముళ్లు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... బత్తుల గంగాభవానీ - ఉమా మహేశ్వరి - నాగమల్లిక - బుర్రా గంగా భవానీ - ఆదిలక్ష్మి - శీకోటి అప్పలకొండ త‌దిత‌రులు బీజేపీకి కేటాయించిన సీట్ల‌లో నామినేష‌న్లు వేసేశారు. స్థానిక ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించ‌కుండా... స్థానికంగా ఉంటున్న త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఆ సీట్ల‌ను బీజేపీకి ఎలా కేటాయిస్తార‌న్న‌ది వీరి ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఎంత మిత్ర‌ప‌క్ష‌మైనా త‌మ‌కు మంచి బ‌ల‌మున్న స్థానాల‌ను తాము ఎలా వ‌దులుకుంటామ‌ని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు. స‌రిగ్గా చంద్ర‌బాబు కాకినాడ ప్ర‌చారానికి వెళ్లే స‌మ‌యానికి ఒక రోజు ముందుగా చోటుచేసుకున్న ఈ ప‌రిణామం టీడీపీ కేడ‌ర్‌ను నిజంగానే అయోమ‌యానికి గురి చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఈ త‌ర‌హా ఇబ్బందుల నుంచి పార్టీని, తెలుగు త‌మ్ముళ్ల‌ను బాబు ఎలా దారిలో పెడ‌తారో చూడాలి.