Begin typing your search above and press return to search.

రిబ్బన్ కటింగ్ అంటే రెడ్డి గారు రెడీట ... ఏమి చేశారని ...?

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 AM GMT
రిబ్బన్ కటింగ్ అంటే రెడ్డి గారు రెడీట ... ఏమి చేశారని ...?
X
మూడున్నరేళ్ల ముఖ్యమంత్రిత్వం. అయినా సరే ఒక్క ప్రాజెక్ట్ ని కూడా చివరి దశలో కూడా పూర్తి చేయలేని అసమర్ధ సీఎం జగన్ అంటూ టీడీపీ ఒక్క తీరున ఫైర్ అవుతోంది. అంతా మేము చేస్తే చివరి నిముషంలో వచ్చి రిబ్బన్ కటింగ్ కి రెడీ అని రెడ్డి గారు అంటారు అంటూ మాటల మంటలతో వేడెక్కించింది. ఇంతకీ టీడీపీ ఎందుకింత మండుతోంది. వైసీపీ చేసిందేంటి అంటే చాలానే కధ ఉంది.

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ పనులు, నెల్లూరు బ్యారేజి పనులను పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. దీంతో వైఎస్సార్ 2008లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులను తనయుడు జగన్ పూర్తి చేశారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో గొప్పగా ప్రకటించుకుంది. సంగం బ్యారేజి వల్ల 3.85లక్షల ఎకరాలు. నెల్లూరు బ్యారేజి వల్ల 99,525 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దాన్ని వైసీపీ చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.

వైఎస్సార్ ప్రారంభించిన జల యజ్ఞం కార్యక్రమాలను కంటిన్యూ చేస్తోంది జగన్ మాత్రమే అని కూడా ఆర్భాటం చేస్తోంది. మంత్రి రోజా అయితే ట్వీట్ చేస్తూ టీడీపీని మరింత రెచ్చగొట్టారు అనుకోవాలి. వైఎస్సార్ గుమ్మడి కాయ కొట్టి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తే జగన్ వాటిని గుమ్మడి కాయ కొట్టి పూర్తి చేస్తున్నారని చెప్పడం ద్వారా ఘనత అంతా తమదే అని చెప్పేసుకున్నారు.

అయితే ఈ విషయంలో జగన్ చేసిందేంటి అని టీడీపీ నేతలు కూడా ట్విట్టర్ వేదికగా వార్ స్టార్ట్ చేశారు. అంతా మేమే చేశామని చివరాఖరున జగన్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు అని టీడీపీ ద్వజమెత్తింది. చంద్రబాబు టైం లోనే ఈ రెండు ప్రాజెక్టులు దాదాపుగా పూర్తి అయ్యాయని ఆ పార్టీ అంటోంది. సంగం బ్యారేజి 85 శాతాన్ని బాబు పూర్తి చేశారని, జస్ట్ పదిహేను శాతం పూర్తి చేయడానికి జగన్ కి ఇంత టైం పట్టిందని ఎద్దేవా చేసింది.

ఇక నెల్లూరు బ్యారేజిని చంద్రబాబు 90 శాతం పూర్తి చేశారని వివరాలు బయటపెట్టింది. కేవలం పది శాతం చేయడానికి కూడా వైసీపీ మూడేళ్ళు పైగా టైం తీసుకుందని, ఇపుడు హడావుడి చేస్తోంది అంటోంది. మొత్తానికి ఈ రెండు పార్టీలు ఇలా క్రెడిట్ కోసం ట్విట్టర్ ద్వారా వార్ కి తెర లేపడం మాత్రం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇక్కడ అటు వైసీపీ అయినా టీడీపీ అయినా ఒక విషయం మరచిపోతున్నాయని అంటున్నారు.

అదేంటి అంటే మధ్యలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎం లుగా ఉన్నారు. వారు కూడా ఎంతో కొంత చేసి ఉంటారు. అయినా ప్రభుత్వం అన్నాక అది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ అవుతుంది. నాడు బాబు స్టార్ట్ చేసినవి నేడు జగన్ పూర్తి చేస్తే నేడు జగన్ తలపెట్టినవి రేపు బాబు అధికారంలోకి వస్తే తామే చేశామని చెప్పుకుంటారు. దీని కోసం రాజకీయంగా వాదులాడుకోవడం అంటే అది రాజకీయంగా చిల్లరతనమే అని కూడా అంటున్నారు. అయినా సరే రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది కాబట్టి లాస్ట్ పంచ్ ఎవరిదైతే ఆ కిక్కు కూడా వారిదే అవుతుంది అనుకోవాలి. సో ఇది తెగని రాజకీయ పంచాయతీగానే చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.