Begin typing your search above and press return to search.

స్పందన కార్యక్రమం టీడీపీకి అస్త్రంగా మారుతోందా?

By:  Tupaki Desk   |   21 Sep 2019 1:30 AM GMT
స్పందన కార్యక్రమం టీడీపీకి అస్త్రంగా మారుతోందా?
X
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే.. అమల్లోకి వచ్చిన కార్యక్రమం స్పందన. ఈ కార్యక్రమం ఏదో తూతూమంత్రంగా కాకుండా.. చాలా స్ట్రిక్ట్ గా నిర్వహించాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు - ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని - వాటి పరిష్కారానికి అక్కడే అధికారికంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి.

ఇది ప్రజలకు ఉపయుక్తంగా మారుతోంది. పనులు చకచకా జరిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రజా స్పందన కూడా బాగుంది. ఇలాంటి క్రమంలో.. కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని తమ అవసరాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇలాంటి వాటిల్లో ఒకటి ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. అక్కడ ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చెందిన కుటుంబంలో ఒక మహిళకు ఆరోగ్యం బాగోలేకపోయింది. వైద్యం కోసం డబ్బులు లేక..వాళ్ల భూమిని టీడీపీ కార్యకర్త ఒకరికి తాకట్టు పెట్టారట. అలా డబ్బులు తీసుకుని.. వైద్యం చేయించుకున్నారు. అయినప్పటి ఆమె బతకలేదని తెలుస్తోంది. కొంత సొమ్ము మాత్రమే తీసుకుని భూమిని తనఖా పెట్టారు.

ఆమె బతకకపోవడంతో.. కొన్ని రోజులకు ఆ డబ్బులను వెనక్కు ఇచ్చి - వడ్డీతో సహా చెల్లించి తనఖాలోని భూమిని వెనక్కు రాయించుకోవడానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆ భూమిని తెలుగుదేశం కార్యకర్త తన పేరు మీదకు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.

స్పందన కార్యక్రమానికి వెళ్లి.. తనకు రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని ఫిర్యాదు చేసి - ఆ భూమిని తన పేరు మీదకు బదలాయించుకున్నాడట తెలుగుదేశం కార్యకర్త. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వారి పక్షానే ఇలాంటి సమస్యలను పరిష్కరించేస్తూ ఉండటంతో.. తెలుగుదేశం కార్యకర్తలు ఇలాంటి లొసుగును అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అధికారం చేతిలో లేకపోయినా.. టీడీపీ వాళ్ల తీరు మాత్రం మారలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.