Begin typing your search above and press return to search.

టీడీపీ టైమింగ్.. వైసీపీకి డ్యామేజింగ్

By:  Tupaki Desk   |   20 Oct 2021 12:30 PM GMT
టీడీపీ టైమింగ్.. వైసీపీకి డ్యామేజింగ్
X
ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌నేది తెలిసిన విష‌య‌మే. అధికార పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం.. ప‌ని గ‌ట్టుకుని మ‌రీ సీఎంపై మాట‌ల‌తో విరుచుకుప‌డ‌డం.. ఇలా అవ‌కాశం దొరికిన ప్ర‌తి సారి ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీని ఇర‌కాటంలోకి నెట్టి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త భావం పెంచేందుకు ప్ర‌తిప‌క్షం ఆరాట‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగు దేశం పార్టీ అందుకు మిన‌హాయింపేమీ కాదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ధాటికి చిత్త‌యిన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తూ అధికార పార్టీని ఇబ్బందుల్లో పెట్టే దిశ‌గా సాగుతోంది. అయితే ఇక్క‌డ ఓ విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జ‌ల్లో టీడీపీకి తిరిగి ఆద‌ర‌ణ పొందేందుకు అధికార వైసీపీనే కార‌ణ‌మ‌వుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైసీపీని వాడుకుంటున్నారా? టీడీపీ పార్టీ నేత‌లు అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన తర్వాత టీడీపీ నేత‌ల‌పై పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు బాబు ఇంటి ముట్ట‌డి త‌దిత‌ర సంఘ‌ట‌న‌లను హైలైట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో వైసీపీని దోషిగా నిల‌బెట్టేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తేడాది మార్చిలో టీడీపీ నేత‌లు బొండా ఉమ‌, బుద్ధా వెంక‌న్నపై గుంటూరు జిల్లా మాచ‌ర్లలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నాయ‌కులు ప్ర‌యాణిస్తున్న కారుపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద పెద్ద క‌ర్ర‌ల‌తో దాడికి పాల్ప‌డ‌డం అప్పుడు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడికి నిర‌స‌న‌గా చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి డీజీపీ కార్యాల‌యం వ‌ర‌కూ పాద‌యాత్ర చేసిన డీజీపీ కార్యాల‌యం ముందు బైఠాయించారు. అధికార వైసీపీ దాష్ఠికానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఇక ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటి ముట్ట‌డికి ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుప‌డ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డం టీడీపీ నేత‌ల‌కు గాయాలు కావ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రోసారి వేడెక్కింది. ఇక ఇప్పుడేమో గంజాయి విష‌యంలో జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని ఆ పార్టీ కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డంతో పాటు ఇత‌ర జిల్లాల్లోని కార్యాల‌యాల‌పైనా దాడులు చేశారు. ఈ దాడుల‌ను టీడీపీ బాగా వాడుకుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి పాల‌న న‌డుస్తుందో ఈ దాడుల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని వైసీపీ నాయ‌కులు రౌడీయిజం చేస్తున్నారంటూ టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఈ దాడుల వ‌ల్ల టీడీపీకే మేలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. మొత్తానికి టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ఈ దాడులు చేయ‌డం వ‌ల్ల న‌ష్టపోయే ప్ర‌మాదం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.