Begin typing your search above and press return to search.

తెదేపా గగ్గోలు : మనకింక దిక్కెవ్వరు?

By:  Tupaki Desk   |   18 July 2017 5:20 PM GMT
తెదేపా గగ్గోలు : మనకింక దిక్కెవ్వరు?
X
నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి దక్కబోతుండడం గురించి... ఆయనను ఎరిగిన నాయకులు అందరికీ సంతోషంగానే ఉండవచ్చు గాక! కానీ.. ‘అయ్యో ఇలా జరిగిందేమిటా’ అని కుమిలిపోతున్నవారు కూడా అనేకులు ఉన్నారు. ప్రధానంగా ఏపీలోని తెలుగుదేశం నాయకుల్లో విపరీతమైన భయం వ్యక్తం అవుతోంది. మంగళవారం నాడు పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం, కేబినెట్ భేటీల్లో ఏ ఇద్దరు నాయకుల మధ్య అయినా ప్రధానంగా ఇదే చర్చ నడిచింది. ఏదో ఢిల్లీలో వెంకయ్యనాయుడు కేబినెట్ లో ఉంటే.. అంతో ఇంతో కొన్ని పథకాలకు నిధులు రాబట్టుకుంటూ... అంతా మన ఘనతే అయినట్లుగా డప్పు కొట్టుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాం.. ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం ఉండని ఉపరాష్ట్రపతి పదవిలోకి వెళ్లిపోతే.. ఇక మన గురించి మాట్లాడే వాళ్లెవరు? అని నాయకులు మధన పడుతున్నారట.

ఏపీ తెలుగుదేశం నాయకులు కూడా పలువురు వెంకయ్యకు ఫోను ద్వారా శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది. ఏపీలో మూడేళ్ల పాలనలో ఇప్పటిదాకా జరిగిన నిర్దిష్టమైన ప్రగతి శూన్యం. ప్రపంచం తల తిప్పి చూసే స్థాయిలో రాజధాని నగరాన్ని నిర్మించేస్తున్నాం అనే ఆడంబరపు ప్రకటనల్ని.. ఆ ప్రాంతంలో వేసిన దిక్కూమొక్కూలేని శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వెంకయ్యనాయుడు తాను ప్రత్యక్షంగా అండగా ఉన్నట్లుగానే చంద్రబాబు సర్కారుకు కేంద్రం నుంచి సహకరిస్తున్నారు. ఏపీ విజ్ఞప్తులను అక్కడ పట్టించుకునే వారు తక్కువే అయినప్పటికీ.. ఆయన స్వయంగా పూనుకుని కొన్ని కొన్ని అయినా సానుకూలంగా అయ్యేలాగా చక్కబెడుతున్నారు.

ఢిల్లీలో కేంద్రప్రభుత్వంతో లాబీయింగ్ చేయడానికి తమకు మరొక నాయకుడి అవసరం లేకుండా... ఏపీసర్కారు వెంకయ్య సేవలనే వినియోగించేకుంటోంది. ఆయనకూడా దానికి తగినట్లుగానే.. రాష్ట్ర్రానికి చారానా సాయంచేస్తే బారానా ప్రచారం చేసుకుంటూ.. ఊరూరా సన్మానాలు చేయించుకుంటూ చెలరేగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో హఠాత్తుగా ఆయనను కేబినెట్ నుంచి పక్కకు మళ్లించి... వైస్ ప్రెసిడెంట్ బంగళాకు పరిమితం చేయడం జరుగుతోంది. ఏదో ఎన్నికల సంవత్సరం అనదగిన చివరి సంవత్సరంలో వెంకయ్య ద్వారా ఇంకాస్త నిధులు తెప్పించుకుని... అన్ని పథకాల్లో కాస్త మాయ చేసి ప్రతిదానినీ పెండింగులో ఉంచి.. మళ్లీ మమ్మల్నే గెలిపించాలి అని డిమాండు చేద్దాం అనుకుంటే వ్యూహం బెడిసికొట్టిందని తెదేపా నేతలు దిగులుపడుతున్నారుట.