Begin typing your search above and press return to search.

బొమ్మ సూపర్ హిట్టేనా : సునామీలూ...పోటెత్తడాలూ...?

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 AM GMT
బొమ్మ సూపర్ హిట్టేనా  : సునామీలూ...పోటెత్తడాలూ...?
X
సగటు జనాలు దైనందిన రాజకీయాలా మీద స్పందిస్తారా. నిజానికి వారికి ఆ టైమ్ ఉందా. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. జవాబు బహు కష్టం. ఎందుకంటే జనాలకు సవాలక్ష పనులు. వారి జీవితమే అంత. తెల్లారిలేస్తే తిరిగి పక్క చేరేవరకూ సమస్యలతో పోరాటమే చేయాలి. ఈ దేశాన రెక్కాడితే కానీ డొక్కాడని జనాలు నూటికి ఎనభై శాతం. వారంతా తమ చేతికి పట్టెడు అన్నం దక్కితే చాలు అని చూసేవారు. అలా జరిగిన నాడు వారికి అదే పండుగ. ఆ రోజుకు వారే మహారాజులు.

అలాంటి జనాలు అయిదేళ్ళకు ఒకమారు ఈ ప్రజాస్వామ్య దేశాన అచ్చమైన మహారాజులు అవుతారు. ఆ రోజున వారి ఓటుకు విలువ వస్తుంది. వారు చేతిలోనే నాయకుల జాతకం ఉంటుంది. ఓటు వేయకముందు వారి చుట్టూ తిరిగే నాయకులు ఓటేశాక పట్టించుకోరు. అది వేరే కధ. మరి ఓటేశాక జనాలు తిరిగి సామాన్యులే అవుతారు కదా.

అలా వారి వృత్తి వ్యాపకాలలో వారు నిమగ్నం అయిపోతారు. ఇక గెలిచిన వారు అధికారం చలాయిస్తే ఓడిన వారు కుర్చీ వైపు అశగా చూస్తూ ఉంటారు. అయిదేళ్ళ పాటు ఇలా అధికార ప్రతిపక్ష రాజకీయ చదరంగం సాగుతూనే ఉంటుంది. మధ్యలో పావులు లాంటి జనాలు అటూ ఇటూ ఉంటారు.

వారిని అడ్డం పెట్టుకునే రాజకీయ జీవులు కధ నడుపుతారు. ఇంతకీ ఈ పావులు లాంటి జనాలు ఏ పక్షమో ఎపుడైనా చెప్పారా. అలా చెప్పనిచ్చే వాతావరణం ఉందా. వారు ఓటుగానే తప్ప మరేవిధంగానూ నోరు విప్పలేని దైన్యంలో ఉంటారు. కానీ వారినే ముందు పెట్టి రాజకీయాలు చేసే కామందులు అంతా జనాలు మండిపోతున్నారు అంటారు. జనాలు మా వైపే అంటారు. అధికారంలో ఉన్న వారు అయితే జనాలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకుంటారు.

దానికి రుజువులు ఏంటి అంటే సభలూ సమావేశాలకు జనాలు పెద్ద సంఖ్యలో రావడం. నిజానికి ఈ జనాలు అంతా అలా కోరి తాముగా వచ్చిన వారేనా అంటే జవాబు బహు సులువు. తోలుకు వచ్చిన జనాలే ఏ సభకైనా అందం, అర్ధం. సభ నిండుగా ఉండాలంటే తోలాల్సిందే.

అలా రావడానికి జనాలూ అలవాటు పడ్డారు, వారే తమ జనాలు అని చెప్పుకోవడానికి నేతాశ్రీలు అలవాటుపడ్డారు. మొత్తానికి సభలు సూపర్ హిట్ అవుతున్నాయి.

ఇక ఏపీలో చూస్తే అటు అధికార వైసీపీ మంత్రులు బస్సు యాత్రలను చేస్తూ తమ సభలకు జనాలు విరగబడి వస్తున్నారు అని చెప్పుకుంటోంది. ఇక బాదుడే బాదుడుతో మొదలెట్టి గేర్ మార్చిన టీడీపీ మహానాడు సభ బ్రహ్మాండమైన విజయం సాధించింది అని చెప్పుకుంటోంది. మహానాడుకు జనాలు బాగానే వచ్చారు. అయితే అనుకూల మీడియా టముకేస్తున్నట్లుగా సునామీలు మాత్రం కాదు. టీడీపీకి ఉన్న బలం అలాంటిది. అన్ని జిల్లాల నుంచి జనాలు ఒకే చోటకు వస్ మైదానాలు తే జనాలతో నిండిపోవా.

అలా కనుక చూస్తే టీడీపీకి వచ్చిన జనాలూ తెచ్చిన జనాలూ బాగానే కనిపించారు. ఈ సభను చూసి జగన్ భయంతో వణికిపోతాడు అని చంద్రబాబు సౌండ్ చేశారు. జగన్ కి ఇక నిద్ర పట్టదు అని కూడా బాబు చెప్పేశారు. ఇక వైసీపీకి ఓటమే అని కూడా జోస్యం చెప్పేశారు. తన జీవితంలో ఇంతకు మించిన మహానాడుని చూసి ఎరగను అని కూడా ఆయన అంటున్నారు.

ఇదిలా ఉంటే మా జగనన్న కాలు పెడితే చాలు జనమే జనం అని వైసీపీ వాళ్ళు అంటారు. ఏపీలో అయిదు కోట్ల మంది జనాలు ఉంటే దాదాపుగా అందరికీ అన్ని పధకాలూ ఏదో ఒక రూపంలో అందించాం కాబట్టి అన్ని ఇల్లూ మావే అన్ని ఓట్లూ మావే అని వైసీపీ బీరాలు పోతుంది.

మరి జనాలు ఇంతకీ ఎటువైపు. నిజంగా సభలకు వచ్చిన వారు ఓట్లేస్తారా. అలా కనుక ఓట్లేస్తే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఎందుకు ఓడిపోయారు. ఆయనకూ బ్రహ్మాండంగా జనాలు నాడు వచ్చారు కదా. అంతకు ముందు 2014 ఎన్నికల్లో జగన్ ఎందుకు ఓడారు. ఆయన సభలకు అప్పట్లో జనాలు పోటెత్తారే.

అంటే విషయం అది కాదు, సభలు సూపర్ హిట్ అన్నది ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటిది. ఆ ఫంక్షన్ సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్లు కాదు, అలాగే సభలకు జనాలు వచ్చినంతమాత్రాన ఏ పార్టీ గెలవదు, గెలుపునకు లెక్కలు వేరే ఉన్నాయి. ఆ లెక్కలు కూడా ఎన్నికల వేళనే కరెక్ట్ గా రిజల్ట్ ఇస్తాయి.

మరి అంతవరకూ ఈ కోలాహలాలు, జన సునామీలు ఎందుకు అంటే పార్టీ జనాలను కాపాడుకునేందుకు, అసలు జనాలకు తామే రేసులో టాప్ లో ఉన్నాయమి చెప్పుకునేందుకు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అధికార విపక్షాల యాత్రలు సభలు కూడా అంతవరకే చూడాలి. అంతకు మించి చెప్పేదీ ఏమీ ఉండదు. ఎందుకంటే ఎన్నికల ఫలితం పోలింగ్ కి కొద్ది గంటల ముందు కూడా మారుతుంది కాబట్టి. అప్పటి ఓటరన్న మూడ్ ని ఎవరూ అంచనా వేయలేరు కాబట్టి. ఇక ఈ రోజుకు చూస్తే రాజకీయ పార్టీలకు ఉన్న దురద, ఆదుర్దా జనాలకుఅసలు లేదు కాబట్టి. ఎన్నికల జోస్యాలు చెప్పెదీ ఏమీ లేదనే చెప్పాలి.