Begin typing your search above and press return to search.

అర్ధాలు వేరులే : వైసీపీ...టీడీపీ అంటే.... అదేనట‌?

By:  Tupaki Desk   |   29 May 2022 11:30 AM GMT
అర్ధాలు వేరులే : వైసీపీ...టీడీపీ అంటే.... అదేనట‌?
X
రాజకీయాల్లో మాటలు మాములుగా లేవు. అవి మంటలే పెడుతున్నాయి. ఇక పంచు డైలాగులే వరసబెట్టి పేలుతున్నాయి. సెటైర్లకు అక్కడ కొదవే లేదు. లేకపోతే నాయకుల పేర్లు మార్చేస్తారు, వారి పదవుల పేర్లకూ కొత్త అర్ధాలు చెబుతారు. ఇపుడు ఈ కధ ఎందాకా వచ్చిందంటే పార్టీల పేర్లను కూడా మార్చేస్తున్నారు.

వైసీపీ అంటే ఫుల్ ఫార్మ్ చాలా మందికి తెలుసో తెలియదో కానీ యువజన శ్రామిక రైతు పార్టీ అని అర్ధం. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ అని అంటారు. అంటే వైఎస్సార్ పేరిట పెట్టిన పార్టీగా కూడా చెప్పుకుంటారు. మరి అలాంటి పార్టీ పేరు మార్చేశారు లోకేష్ బాబు.

వైఎస్సార్ కాంగ్రెస్ అంటే యువజన శ్రుంగార రాక్షస పార్టీ అని మహానాడు వేదికగా లోకేష్ బాబు సరికొత్త అర్ధాన్నే చెప్పారు. దాంతో ఇపుడు టీడీపీ తమ్ముళ్ళు ఆ పేరునే పదే పదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

జగన్ రాక్షుసుడని, ఆ పార్టీలో ఉన్న వారు ఉన్మాదులని కూడా టీడీపీ నాయకులు ఘాటు విమర్శలే చేశారు. వారికి రాక్షసత్వం తప్ప మరేదీ తెలియదు అని కూడా విమర్శించారు. మరి దాన్ని వింటూ ఆ తిట్లు తింటూ వైసీపీ నేతలు ఊరుకుంటారా. అందుకే వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే సౌండ్ చేశారు.

ఆయన కూడా తన మాటల గారడీని ఉపయోగించి టీడీపీకి సరికొత్త పేరునే కనిపెట్టారు. నిజానికి టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని వైసీపీ వారు ఇప్పటికీ విమర్శిస్తూంటారు. కానీ ఇపుడు లోకేష్ బాబు తమ పార్టీకి కొత్త పేరు పెట్టడంతో విజయసాయిరెడ్డి మేధస్సుకు పదును పెట్టి పెట్టిన పేరు ఏంటయ్యా అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ అని. టీడీపీ అంటే ఇదీ అర్ధమట.

అంటే ఆ పార్టీలో చేరిన వారు అంతా తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి తప్ప మరేమీ చేయలేరని, ఆ పార్టీకి సీన్ అయిపోయిందని విజయసాయిరెడ్డి అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ కొత్త పేర్లు భలె వైరల్ అవుతున్నాయి. అయినా రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు పోయి ఇపుడు సీన్ కాస్తా పీక్స్ కి చేరుతోంది అంటే ఇదే అన్న మాట.