Begin typing your search above and press return to search.

కాకినాడ‌లో టీడీపీ గెలిచిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   1 Sep 2017 7:33 AM GMT
కాకినాడ‌లో టీడీపీ గెలిచిన‌ట్టేనా?
X
కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ విజ‌య కేత‌నం ఎగుర‌వేసింది. కార్పొరేష‌న్ ప‌రిధిలో మొత్తం 50 వార్డులుంటే... వాటిలో రెండింటిని మిన‌హాయించి మిగిలిన 48 వార్డుల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల క్రితం జ‌రిగిన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేటి ఉద‌యం న‌గ‌రంలోని రంగ‌రాయ మెడిక‌ల్ కళాశాల ఆవ‌ర‌ణ‌లో ప్రారంభమైంది. కౌంటింగ్ స‌గం మేర పూర్త‌య్యేస‌రికే కార్పొరేష‌న్‌ ను టీడీపీ గెలుచుకున్న‌ట్లుగా తేలిపోయింది. పాల‌క‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన స్థానాల‌ను గెలుచుకున్న టీడీపీ... సాంకేతికంగా అక్క‌డ విజ‌యం సాధించిందేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప‌లువురు మంత్రులు - అధికార పార్టీ ఎమ్మెల్యేలు అక్క‌డ భారీ ఎత్తున మోహ‌రించిన నేప‌థ్యం... నంద్యాల ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం కూడా కొంత‌మేర‌కు కాకినాడ‌లో టీడీపీకి సానుకూలాంశాలుగా మారాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా కార్పొరేష‌న్‌ ను కైవ‌సం చేసుకున్న టీడీపీకి కాకినాడ‌లో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి. ఎందుకంటే... అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే కొండ‌బాబు సోద‌రుడు శివ‌కుమార్‌ ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. అదే స‌మ‌యంలో బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు మాల కొండ‌య్య‌కు కూడా ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌లేదు. వీరిద్ద‌రు కూడా విప‌క్ష వైసీపీ అభ్య‌ర్థుల చేతుల్లోనే ప‌రాజ‌యం పాల‌య్యారు. అధికార టీడీపీపై వ్య‌తిరేకత ఈ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌న‌డానికి ఈ రెండు ఘ‌ట‌న‌లు ఉదాహ‌ర‌ణ‌గా విశ్లేష‌కులు చెబుతున్నారు.

22వ వార్డు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్యే సోద‌రుడు శివకుమార్ బ‌రిలోకి దిగారు. అప్ప‌టికే త‌న‌కు ఎదుర‌వుతున్న వ్య‌త‌రేక‌త ఎక్క‌డ త‌న సోద‌రుడిని అప‌జ‌యం పాలు చేస్తుందోన‌న్న అనుమానంతో ఎమ్మెల్యేగా ఉన్న కొండ‌బాబు... త‌న సోద‌రుడిపై పోటీగా నిల‌బ‌డ్డ వైసీపీ అభ్య‌ర్థి కిశోర్‌ ను బెదిరింపుల‌కు గురి చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ కిశోర్ ఎమ్మెల్యే బెదిరింపుల‌ను ఏమాత్రం లెక్క చేయ‌కుండా ప్ర‌చారం సాగించారు. నేటి ఉద‌యం వెలువ‌డ్డ ఫ‌లితాల్లో కొండ‌బాబు అనుమానించినంతా అయ్యింద‌నే చెప్పాలి. కిశోర్ చేతిలో శివ‌కుమార్ ఓట‌మిపాల‌య్యారు. మ‌రోవైపు టీడీపీ మిత్ర‌ప‌క్షంగా న‌గ‌రంలోని 9 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ కేవ‌లం మూడు వార్డుల్లోనే విజ‌యం సాధించింది.

9వ వార్డు నుంచి బ‌రిలోకి దిగిన బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు మాల‌కొండ‌య్య వైసీపీ అభ్య‌ర్థి కంప‌ర ర‌మేశ్ చేతిలో ఓడిపోయారు. అంటే... న‌గ‌రంలో అధికార పార్టీ కూట‌మికి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఓట‌మి చ‌విచూశార‌నే చెప్పాలి. అంటే టీడీపీ, బీజేపీ నేత‌ల ప‌ట్ల కాకినాడ జ‌నం త‌మ వ్యతిరేక‌త‌ను వ్య‌క్తం చేసిన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యానికి వ‌స్తే... మొత్తం 48 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే... టీడీపీ 32 వార్డుల‌ను గెలుచుకుంది. వైసీపీ 10 వార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. బీజేపీ మూడు చోట్ల విజయం సాధించగా, అధికార పార్టీ కూట‌మికి రెబెల్స్‌గా బ‌రిలోకి దిగిన మ‌రో ముగ్గురు కూడా అక్క‌డ విజ‌యం సాధించడం గ‌మ‌నార్హం. అంటే ఈ ఎన్నిక‌ల్లో పార్టీని కాకుండా ఆయా పార్టీల త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్థుల‌ను చూసే కాకినాడ జ‌నం ఓటేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.