Begin typing your search above and press return to search.

ఎంపీ గ‌ల్లా ఎదుటే.. రావెల‌పై త‌మ్ముళ్ల దాడి

By:  Tupaki Desk   |   23 Oct 2017 4:28 AM GMT
ఎంపీ గ‌ల్లా ఎదుటే.. రావెల‌పై త‌మ్ముళ్ల దాడి
X
ద‌ళిత నేత‌ - రావెల కిశోర్‌ బాబు.. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో జేజేలు కొట్టిన చేతులే.. ఆయ‌న‌ మాజీ అయ్యాక దాడులు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి! దీంతో ఘ‌నంగా ప్రారంభించిన ``ఇంటింటికీ తెలుగు దేశం`` కార్య‌క్ర‌మం అభాసుపాలైంది. ఈ దారుణ‌ ప‌రిస్థితి గుంటూరులో ఆదివారం చోటు చేసుకుంది. విష‌యంలోకి వెళ్తే.. జిల్లాలోని వింజనంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబుపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా రావెల ఉన్నారు. అయితే, ఆయ‌న మంత్రి ప‌ద‌విని కోల్పోయాక‌.. ఇక్క‌డి త‌మ్ముళ్లు రెండుగా చీలిపోయారు. ఓ వ‌ర్గం ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌గా - రెండో వ‌ర్గం రావెల ప‌క్షంగా ఉంది. దీంతో ఈ రెండు వ‌ర్గాల మధ్య తరచుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ నేఫథ్యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు వింజనంపాడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడానికి ఎంపీ జయదేవ్ వచ్చారు. ఈ కార్యక్రమంపై టీడీపీలోని రెండు వర్గాలు పంతాలకు పోయాయి. దీంతో ఓ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఎంపీ గల్లా జయదేవ్‌ ని కలిసి.. రావెల కిశోర్‌ బాబు తమ గ్రామానికి వస్తే.. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టాలనుకుంటే గ్రామం ప్రారంభంలో ఉన్న ఎన్టీఆర్ - పరిటాల రవి విగ్రహాలకు పూల మాలలు వేసి.. ఆ తరువాత గ్రామంలో కార్యక్రమం చేపట్టాలన్నారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వెంట‌నే గల్లా జయదేవ్ - రావెల కిశోర్ బాబు - జిల్లా పరిషత్ చైర్మన్ - స్థానిక నేతలు మంతనాలు జరిపారు. గ్రామంలో ఉన్న విగ్రహాలకు పూలమాల వేసి గ్రామంలోకి వెళ్లేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా చెప్పినట్లు కాకుండా.. గ్రామం ప్రారంభంలో ఉన్న ఎన్టీఆర్ - పరిటాల రవి విగ్రహాలకు పూల మాల వేయకుండా... పార్టీకి చెందిన వేరొక వర్గం వారు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మరో వర్గం కార్యకర్తలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించారు. గ్రామం ప్రారంభంలో ఉన్న విగ్రహాల వింగ్స్‌ కి తాళాలు వేశారు.

అయితే ఈ కార్యక్రమంలో ఓ వర్గం కార్యకర్తలు పాల్గొనని విషయాన్ని గమనించిన జయదేవ్.. కార్యక్రమం పూర్తయిన తరువాత.. రావెల కిశోర్ బాబుతో కలిసి అసంతృప్తి వర్గానికి చెందిన విగ్రహాలకు దండలేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలు.. జయదేవ్ - రావెలను అడ్డుకున్నారు. వారిపై దాడికి యత్నించారు. మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారా? అని ప్ర‌శ్నించారు. దీంతో కిశోర్ బాబు పోలీసుల సాయంతో బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో టీడీపీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొత్తానికి ఈ ప‌రిణామం.. గుంటూరులో టీడీపీ ప‌రిస్థితిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.