Begin typing your search above and press return to search.

నడిపించాల్సిన వాళ్లే.. న‌ట్టేట ముంచుతున్నారా?

By:  Tupaki Desk   |   25 Feb 2022 9:32 AM GMT
నడిపించాల్సిన వాళ్లే.. న‌ట్టేట ముంచుతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించ‌క‌పోతే తెలుగు దేశం పార్టీకి మ‌నుగడ ఉండ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితానికి ముగింపు ప‌ల‌కాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని బాబు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొదలెట్టారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేస్తు ఇంఛార్జీల‌ను నియ‌మిస్తున్నారు. పార్టీ బ‌లోపేతం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఒక‌వైపు బాబు ఇంత చేస్తుంటే.. మ‌రోవైపు పార్టీలోని ఇద్ద‌రు కీల‌క నేత‌ల వైఖ‌రి పార్టీకి ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందులో ఒక‌రు ప్ర‌స్తుత టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు కాగా.. మ‌రొక‌రు మాజీ అధ్య‌క్షుడు క‌ళా వెంక్ర‌టావు.

తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా కంచుకోట‌లా ఉండేది. కానీ గ‌త ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిన టీడీపీ అక్క‌డ ఓ ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌ష్ట‌ప‌డితే తిరిగి ఆ జిల్లాలో పార్టీకి పున‌ర్వైభ‌వం ద‌క్కుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కానీ ఇప్పుడు అక్క‌డ అచ్చెన్నాయుడు, క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గాల మ‌ధ్య విభేదాల‌తో పార్టీ డ్యామేజ్ అవుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆధిప‌త్య పోరుతో పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాకు బాబు ఎప్పుడూ ప్రాధాన్య‌త ఇస్తార‌న‌డంలో సందేహం లేదు. ఏపీ టీడీపీకి ఇప్ప‌టివ‌ర‌కూ అధ్య‌క్షులైన ఇద్ద‌రు నాయ‌కులూ ఆ జిల్లాకు చెందిన‌వాళ్లే. అప్పుడు క‌ళా వెంక‌ట్రావు.. ఇప్పుడు అచ్చెన్నాయుడు శ్రీకాకుశం జిల్లా నేత‌లే. వాళ్ల‌ను న‌మ్మి అధిష్ఠానం బాధ్య‌త‌లు అప్ప‌జెపితే ఆ ఇద్ద‌రు నేత‌లు మాత్రం ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిసింది. పార్టీని గాడిలో పెట్ట‌డం వ‌దిలేసి.. త‌మ మ‌ధ్య కోల్డ్‌వార్‌తో మ‌రిన్ని స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నార‌ని స‌మాచారం. ఎప్ప‌టి నుంచో ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉన్నా.. ఇప్పుడది ముదిరింద‌ని అంటున్నారు.

ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియెజకవర్గాలలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్నఎసరు పెడుతున్నట్టు కళావర్గం ఆరోపిస్తోంది. రాజాం మినహా మిగతాచోట్ల ఉన్న పార్టీ ఇంఛార్జ్‌లు కళావెంకట్రావు అనుచరులుగా ముద్ర ఉంది. దీంతో వారందర్నీ అచ్చెన్న పక్కన పెడుతున్నారన్నది వారి వాదన. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని అచ్చెన్న తెరవెనక పావులు కుదుపుతున్నరన్నది కళా వర్గం టాక్. అవే పార్టీలో దుమారం రేపుతున్నాయి. సొంతపార్టీ నేతల మధ్య వర్గ పోరుగా మారింది. దీంతో తెలుగు త‌మ్ముళ్లు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.