Begin typing your search above and press return to search.

బెజవాడ తెలుగు తమ్ముళ్ల పంతాలు.. పార్టీకి తంటాలు

By:  Tupaki Desk   |   20 Feb 2021 12:17 PM GMT
బెజవాడ తెలుగు తమ్ముళ్ల పంతాలు.. పార్టీకి తంటాలు
X
రాజకీయ వేడికి కేంద్రమైన బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య పంతాలు, పట్టింపులూ పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ మాటల యుద్ధం పెద్దదవుతోంది. అది కాస్తా చినికిచినికి గాలివానలా మారి పార్టీకే నష్టం కలిగించబోతోంది.మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండడంతో బెజవాడ టీడీపీలో చిచ్చు మొదలైంది.

కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలు పోడుతున్నారని పలువురు నేతలు మండిపడుతున్నారు.అయితే నాని వాదన మరోలా ఉంది. సామంతరాజుల్లాంటి నాయకులతో గెలుపు కష్టమని.. అవినీతిపరులకు టికెట్లు ఇవ్వబోమని.. తనకు కావాల్సింది గెలుపు గుర్రాలంటూ నాని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చిచ్చు రేపుతున్నాయి.దీంతో ఎంపీ కేశినేనికి వ్యతిరేకంగా విజయవాడ టీడీపీ అసమ్మతి నేతలంతా అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఎంపీ వ్యతిరేక వర్గం అంతా ఏకమై ఆయనపై కత్తులు నూరుతోంది. ఎంపీ నానికి, నగర టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం నాయకులకు మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది.బెజవాడ టీడీపీలో ఫైట్ అంతర్గత విభేదాలు త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పుట్టి ముంచుతాయని.. పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

2013లో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో నాడు అధికారంలో ఉండడంతో టీడీపీ గెలిచింది. ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయం ఖాయమే. కానీ విభేదాలతో రచ్చ కెక్కుతూ గెలుపును కష్టంగా మార్చుకుంటున్నారన్న చర్చ సాగుతోంది.