Begin typing your search above and press return to search.

ఇవాళ లోక్ స‌భ‌లో ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   19 March 2018 8:21 AM GMT
ఇవాళ లోక్ స‌భ‌లో ఏం జ‌రిగింది?
X
ఏదో జ‌రుగుతుంద‌న్న ప్ర‌చారం కొన్ని మీడియా సంస్థ‌లు హ‌డావుడి చేసినా.. చాలామందికి ఇవాళ ఏమీ జ‌ర‌గ‌ద‌న్న భావ‌నలోనే ఉన్నారు. ఇలాంటి వారి అంచ‌నానే నిజ‌మైంది. ఏపీ అధికార‌.. విప‌క్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్ స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతుంద‌న్న అంచ‌నాలు తేలిపోయాయి. అదేమీ సాధ్యం కాద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప్ర‌త్యేక హోదాతో పాటు.. విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై టీడీపీ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని స‌భ‌కు ఇవ్వ‌టం తెలిసిందే.

స‌భ ఆర్డ‌ర్ లో లేనందున.. అవిశ్వాసంపై ఎలాంటి చ‌ర్చా లేకుండా మొన్న స‌భ వాయిదా ప‌డిన నేప‌థ్యంలో.. సోమ‌వారం ఏదో జ‌రుగుతుంద‌న్న మాట‌ను ప‌లువురు వ్య‌క్తం చేశారు. సోమ‌వారం సైతం టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు లోక్ స‌భలో అవిశ్వాస తీర్మానాన్ని స్పీక‌ర్ కు అంద‌జేశారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే.. టీఆర్ ఎస్‌.. ఏఐడీఎంకేలు త‌మ త‌మ డిమాండ్ల సాధ‌న కోసం హ‌డావుడి చేశాయి. దీంతో.. స‌భ‌ను ఆర్డ‌ర్ లో పెట్టేందుకు ప్ర‌య‌త్నించిన స్పీక‌ర్.. సాధ్యం కాక‌పోవ‌టంతో ప‌న్నెండు గంట‌ల వ‌ర‌కూ వాయిదా వేశారు.

తిరిగి స‌మావేశ‌మైన వెంట‌నే.. టీఆర్ ఎస్‌.. ఏఐడీఎంకే నేత‌లు మ‌ళ్లీ నిర‌స‌న షురూ చేశారు. ఈ హ‌డావుడిలోనే స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ మాట్లాడుతూ.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల‌ను స‌భ ముందుకు తేవాల్సి ఉంద‌న్న మాట‌ను చెప్పారు. అయితే.. అంత‌కు ముందు స‌భ జ‌ర‌గాల‌ని.. ప్ర‌శాంతంగా ఉండాల‌ని స‌భ్యుల్ని కోరారు. అయిన‌ప్పటికీ.. స‌భ్యులు త‌మ తీరు మార్చుకోకుండా అదే ప‌నిగా నినాదాలు చేయ‌టంతో..చేసేదేమీ లేక‌.. స‌భ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

స‌భ‌లో చ‌ర్చ జ‌రిగేవ‌ర‌కూ అవిశ్వాస తీర్మానాన్ని ఇస్తామంటూ ఏపీ విప‌క్షం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం మ‌రోసారి మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వ‌నుంది. స్పీక‌ర్ కు ఇచ్చే ముందు.. టీఆర్ ఎస్ ఎంపీల‌తోనూ మాట్లాడి.. వారిని స‌హ‌క‌రించాల‌ని కోరితే ప్ర‌యోజ‌నం ఉంటుందేమో?