Begin typing your search above and press return to search.

కొంచెం కష్టపడితే.. ఈ సీటు టీడీపీదే!

By:  Tupaki Desk   |   29 Oct 2022 1:30 PM GMT
కొంచెం కష్టపడితే.. ఈ సీటు టీడీపీదే!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి అధికారంలోకి రావడం ప్రాణావసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముందుగా సులువుగా గెలుపు సాధించగల నియోజకవర్గాలపై దృష్టి సారించిందని చెబుతున్నారు.

గతంలో కృష్ణా జిల్లాలో ఉండి ప్రస్తుతం ఏలూరు జిల్లాలోకి చేరిన నూజివీడు నియోజకవర్గంపై కాస్త దృష్టి పెడితే సులువుగా ఈ సీటును టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఉన్నారు. ఈయన 2004లో కాంగ్రెస్‌ తరఫున, 2014, 2019ల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ నుంచే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

కాగా వెలమ సామాజికవర్గానికి చెందిన మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు జగన్‌ మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని ఆశించారు. అయితే ఆయనకు చోటు దక్కలేదు. అందులోనూ వెలమ సామాజికవర్గం నుంచి మంత్రులెవరూ లేకపోవడంతో సామాజిక సమీకరణాలు కలిసి వచ్చి తనకు మంత్రి పదవి ఖాయమని అప్పారావు లెక్కలు వేసుకున్నారు. అయితే ఆయన ఆశ ఆవిరే అయ్యింది.

దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన చురుగ్గా లేరని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సైతం అప్పారావు చురుగ్గా పాల్గొనడం లేదని అంటున్నారు. మంత్రి పదవి తనకు రాకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

అలాగే ఆయనకు కొంతకాలంగా ఆరోగ్యం కూడా బాగుండటం లేదని చెబుతున్నారు. దీంతో కూడా ఆయన చాలాకాలం నియోజకవర్గానికి దూరమయ్యారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడిని పోటీ చేయించే యోచనలో మేకా అప్పారావు ఉన్నారని అంటున్నారు. అయితే సీఎం జగన్‌ వారసులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే తేల్చిచెప్పారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇప్పుడున్నవారే పోటీ చేయాలని జగన్‌ ఆదేశించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మరోసారి నూజివీడు బరిలోకి దిగితే ఆయన గెలవడం అంత సులువు కాదని అంటున్నారు. నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ ఏర్పడ్డాక ఏకంగా ఇప్పటివరకు ఐదుసార్లు నెగ్గింది, మిగిలిన పార్టీలన్నీ కలిపి మూడుసార్లే నెగ్గాయి.

ఈ నేపథ్యంలో టీడీపీకి సంస్థాగతంగా ఈ నియోజకవర్గంలో ఉన్న గట్టిపట్టు, వైసీపీ ఎమ్మెల్యే అప్పారావు చురుగ్గా లేకపోవడం తదితర కారణాలతో టీడీపీ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు కొంచెం శ్రమిస్తే ఇక్కడ గెలుపు బాట పట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.