Begin typing your search above and press return to search.

కాపీ మాస్ట‌ర్ మ‌రో ప‌థ‌కం!... ఏపీలోనూ రైతు బంధు!

By:  Tupaki Desk   |   20 Jan 2019 9:51 AM GMT
కాపీ మాస్ట‌ర్ మ‌రో ప‌థ‌కం!... ఏపీలోనూ రైతు బంధు!
X
రైతు బంధు... దేశానికి అన్నం పెట్టే రైతుల‌కు ప్ర‌భుత్వం నుంచి పెట్టుబ‌డి అందించే ప‌థ‌కం. ఈ కొత్త త‌ర‌హా సంక్షేమ ప‌థ‌కానికి ఏపీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూప‌క‌ల్ప‌న చేస్తే... దానిని ఏకంగా అమ‌లు చేసిన ఘ‌న‌త టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు ద‌క్కింది. ఈ ప‌థ‌కం కింద ఒక్కో ఎక‌రానికి ఏడాదికి రూ.8,000ల చొప్పున ప్ర‌భుత్వం నేరుగా రైతు ఖాతాలో డ‌బ్బు జ‌మ చేస్తుంది. ఈ మొత్తాన్ని రైతు తిరిగి ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేదు. ఈ ప‌థ‌కం కేసీఆర్ రెండో ద‌ఫా అధికారంలోకి రావ‌డంలో కీల‌క భూమిక పోషించింది. ఇప్పుడు ఈ ప‌థ‌కం దేశవ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయింది. ప‌లు రాష్ట్రాలు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు రంగంలోకి దిగిపోగా...కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కూడా ఈ ప‌థ‌కం అమ‌లుకు వ్యూహ ర‌చ‌న చేస్తోంది.

అంత‌గా ప్రాచుర్యం పొందిన ఈ ప‌థ‌కాన్ని ఏపీ పాలిటిక్స్‌ లో కాపీ మాస్టర్‌ గా పేరొందిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా కాపీ పేస్ట్ చేసేందుకు దాదాపుగా ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అయితే ఎక్క‌డ తాను ప్ర‌వేశ‌పెట్ట‌బోయే ఈ ప‌థ‌కానికి కాపీ పేస్ట్ అనే పేరు పెడ‌తారేమోన‌న్న భ‌యంతో ఈ ప‌థ‌కానికి కాస్తంత మార్పులు చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ మార్పులు అమ‌లు సాధ్య‌మో, కాదోన‌న్న అనుమానాలు ఉన్నా... ముందుగా అమ‌లు చేస్తామ‌ని చెబితే స‌రి అన్న దిశ‌గా బాబు దూసుకెళుతున్నార‌ట‌. అయినా ఈ ప‌థ‌కానికి చంద్ర‌బాబు చేస్తున్న మార్పులు ఏమిటంటే... తెలంగాణ‌లో భూముల య‌జ‌మానులుగా ఉన్న రైతుల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తే... ఏపీలో భూ యజ‌మానుల‌తో పాటు కౌలు రైతుల‌కు కూడా ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తార‌ట‌. కౌలు రైతుల‌కు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకే చేత కాని చంద్ర‌బాబు స‌ర్కారు... మ‌రి రైతు బంధును ఎలా అమ‌లు చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే... కేసీఆర్‌ కు ఉప‌యోగ‌ప‌డిన‌ట్టుగానే... ఈ ప‌థ‌కం కూడా ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తుంద‌ని బాబు బాగానే న‌మ్ముతున్నార‌ట‌. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఇచ్చిన రుణ మాఫీ హామీని ఇప్ప‌టిదాకా అమ‌లు చేసిన పాపాన పోని చంద్ర‌బాబు... ఇప్పుడు ఆ హామీ బూజును కూడా దులుపుతున్నార‌ట‌. డ్వాక్రా మ‌హిళ‌ల రుణ మాఫీ కోసం బాబు స‌ర్కారు ఏకంగా రూ.10 వేల కోట్ల‌ను రెడీ చేసుకునే ప‌నిలో ప‌డిపోయింద‌ట‌. అటు రైతు బంధు, ఇటు డ్వాక్రా రుణ మాఫీలకు సంబంధించి ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యం తీసేసుకున్న చంద్ర‌బాబు... రేపు జ‌ర‌గ‌నున్న కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయించుకుని ఘ‌నంగా ప్ర‌క‌టిస్తార‌ట‌. కాపీ పేస్ట్ మాదిరిగా పింఛ‌న్లు, రైతు బంధు త‌ర‌హా ప‌థ‌కాల‌ను వెంట‌వెంట‌నే అమ‌లు చేసేస్తున్న చంద్ర‌బాబుకు... ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చూడాలి.