Begin typing your search above and press return to search.
సత్తా చాటిన చాయ్ వాలా....
By: Tupaki Desk | 24 Jun 2015 12:04 PM GMTచాయ్ వాలా... నరేంద్రమోడీ బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఎన్నికయిన తర్వాత ఈ పేరుకు క్రేజ్ వచ్చింది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ చాయ్ వాలా అనే పదానికి మరింత ప్రచారం దక్కింది. తాను టీ అమ్ముకున్న సామాన్యమైన వ్యక్తినని, దేశంలోనే అత్యంత కీలకమైన పదవికి ఎంపిక కావడం తన అదృష్టమని మోడీ చెప్పడం ఆయన హుందా తనాన్ని పెంచడమే కాకుండా..దేశవ్యాప్తంగా చాయ్ వాలాలకు గుర్తింపునిచ్చింది. అయితే ఇపుడ మరోమారు చాయ్ వాలా పదం తెరమీదకు వచ్చింది.
భోపాల్‌కు చెందిన చాయ్ వాలా రాజేశ్ సాక్రే విజయగాథ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఐదో తరగతి వరకు చదువుకున్న రాజేశ్ సాక్రే జీవనోపాధి కోసం చాయ్ కొట్టు నడిపించుకుంటున్నారు. ఈ క్రమంలో కష్టపడి సంపాదించిన సొమ్ము రూ.20,000 దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్‌బీఐలో దాచుకున్నాడు. తన అవసరాల కోసం అందులోంచి 2011లో ఏటీఎమ్ ద్వారా రూ.10,800 తీసుకున్నాడు. అనంతరం మిగిలిన డబ్బులను తీసుకోవడానికి వెళ్లిన సాక్రేకు... తన ఎకౌంట్‌లో డబ్బులేమీ లేనట్టు తెలిసింది. దీంతో
సాక్రే షాక్ కు గురయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులను కలిసి విషయం తెలిపాడు.
అయితే ఘనత వహించిన బ్యాంకు అధికారులు సాక్రే ఆవేదనను పట్టించుకోకపోగా... ఖాతాదారుడు అని కూడా చూడకుండా ఆయన్నే మందలించారు. సాక్రే ముంబైలోని ఎస్ బీఐ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం శూన్యం. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి తనకు న్యాయం కావాలని కోరాడు. అయితే లాయర్‌ను పెట్టుకునే స్థోమత చాయ్ వాలా అయిన సాక్రేకు లేదు.
ఈ క్రమంలో సాక్రే తన కేసును తానే వాదించుకున్నాడు. తన సొమ్ము జమచేసింది, వాటిని విడుదల చేసుకున్నది వివరించారు. తనకు చెందిన రూపాయలు 9, 000అన్యాయంగా నష్టపోతున్నది వివరించారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులను ఫోరం ప్రశ్నిచింది. సాక్రే డబ్బు డ్రా చేసుకున్నట్టు సాక్ష్యాలు చూపించాలని కోరింది. అయితే ఎస్ బీఐ వద్ద ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఈ క్రమంలో కోర్టుల్లో 12 వాదనల అనంతరం తాజాగా సాక్రేకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. సాక్రేకు రావాల్సిన 9,200 రూపాయలతోపాటు దాని వడ్డీ, కోర్టు ఖర్చుల కింద రెండు వేల రూపాయలు, ఇంతకాలం మానసిక క్షోభ కలిగించినందుకు మరో పదివేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలలలోపు అతని ఖాతాలో జమ చేయాలని సూచించింది.
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ... అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థపై విజయం సాధించిన సాక్రే అభినందనీయుడు. తనను తక్కువగా అంచనా వేసిన అధికారులకు, లాయర్లకు చుక్కలు చూపించి ఆయన కేసు గెలిచిన తీరు అద్భుతం అని అనాల్సిందే. అతతేకాకుండా....ఇతరులకు స్పూర్తి దాయకం అనడంలో సందేహం లేదు.