Begin typing your search above and press return to search.

రేపటి నుండి టీచర్లు స్కూళ్లకు రావాల్సిందే : విద్యాశాఖ మంత్రి !

By:  Tupaki Desk   |   30 Jun 2021 6:30 AM GMT
రేపటి నుండి  టీచర్లు స్కూళ్లకు రావాల్సిందే : విద్యాశాఖ మంత్రి !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మొదటి వేవ్ వచ్చిన నేపథ్యంలో స్కూళ్లు కొన్ని నెలల పాటు మూసేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి విద్యాసంస్థలని ఓపెన్ చేసినా ఎక్కువ రోజులు కొనసాగలేదు. సెకండ్ వేవ్ విజృంభణ తో గత రెండేళ్లుగా పరీక్షలు కూడా లేకుండానే విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారు. ఇక ఈ ఏడాది ఏపీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో పది , ఇంటర్ పరీక్షలు పెట్టాలని చివరి వరకు ప్రయత్నించినా కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోపు పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ఈ మధ్యనే పరీక్షలని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది.

ఇదిలా ఉంటే .. జూలై 1తేదీ నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలలకు రోజు విడిచి రోజు హాజరు కావాలని ఆదేశాలు పంపారు. యు-డైస్‌, అడ్మిషన్లు , టీసీల జారీ తదితర పనులను టీచర్లు చేయాల్సి ఉంటుంది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు స్కూళ్ల ప్రారంభానికి సన్నాహక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వర్క్‌ షీట్లు ఇచ్చి మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌ లైన్‌ తరగతుల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం విద్యామంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ నడుపుతున్న 50 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2021-22కి గాను 5వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 10 వరకు పొడిగిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్‌.ప్రసన్నకుమార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.