Begin typing your search above and press return to search.

రేపే పాక్ తో టీమిండియా ఆసియా కప్ మ్యాచ్.. కూర్పు ఎలాగంటే..?

By:  Tupaki Desk   |   27 Aug 2022 11:30 AM GMT
రేపే పాక్ తో టీమిండియా ఆసియా కప్ మ్యాచ్.. కూర్పు ఎలాగంటే..?
X
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ ఆదివారం ఆసియా కప్ లో తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నఈ మ్యాచ్ రోహిత్ సేనకు ఎంతో కీలకం. నిరుడు ఇదే వేదికపై పాక్ తో జరిగిన టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత్ పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. టి20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టడం భారత అభిమానులను ఎంతగానో బాధించింది.

ముఖ్యంగా పాకిస్థాన్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో తట్టుకోలేకపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఆసియా కప్‌ రూపంలో భారత్‌కు దక్కింది. ఆసియాలోని ఆరు జట్లు 16 రోజుల పాటు 13 మ్యాచ్‌లు ఆడనున్నాయి. శనివారం రాత్రి 7.30కు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ తలపడనున్నాయి. ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఆరేళ్ల తర్వాత తిరిగి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరగబోతోంది. 2018లో వన్డే ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించారు. 2016 నుంచి ఆసియా కప్‌ తర్వాత ఏ ప్రపంచకప్‌ ఉంటే.. అందుకు సన్నాహకంగా ఈ టోర్నీని అదే ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. 2016లో టీ20,2018లో వన్డే ఫార్మాట్లో మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది కాబట్టి
ఇప్పుడు పొట్టి ఫార్మాట్లోనే జట్లు తలపడతాయి.

టీమిండియాకు కూర్పే సమస్య

సాధారణంగా టీమిండియా కూర్పు పెద్దగా సమస్య కాబోదు. అయితే, ఇటీవలి కాలంలో కుర్రాళ్లు శరవేగంగా దూసుకురావడంతో అందరికీ చోటు కల్పించాల్సిన పరిస్థితి. ఎవరిని తప్పించాలన్నా ఇబ్బందిగానే ఉంటోంది. ఉదాహరణకు నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇద్దరూ హార్డ్ హిట్టర్లే. అయితే, హుడా ఆఫ్ స్పిన్ వేయగలడు. సూర్య మ్యాచ్ గతిని మార్చగలడు. మరి ఎవరిని తీసుకోవాలి? ఇక రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్. ఇద్దరూ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్లు. రెండు, మూడేళ్ల కిందటే కెరీర్ అయిపోయిందని భావించిన కార్తీక్ తారాజువ్వలా దూసుకొచ్చాడు. మ్యాచ్ ఫినిషర్ అయిపోయాడు.

పంత్ సంగతి అందరికీ తెలిసిందే. తను క్రీజులో ఉంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఇక ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలి? ఇదే కాదు.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని తప్పిద్దామా? అంటే అంత కఠిన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మరోవైపు టీమిండియా పేస్ గుర్రం బుమ్రా గాయంతో తప్పుకోవడంతో పేస్ భారం భువనేశ్వర్ పైన పడింది.ఇక ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇద్దరినీ కొనసాగించాల్సిన పరిస్థితి. వెరసి.. టీమిండియా సూర్య-హుడాల్లో ఒకరిని, పంత్ -కార్తీక్ ల్లో ఒకరిని పక్కన పెట్టాల్సిందే. రెండో పేసర్ గా అర్షదీప్ ను కొనసాగిస్తూ.. అశ్విన్ లేదా చహల్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగితే.. వన్ డౌన్ లో కోహ్లి, 4వ స్థానలో సూర్య దిగుతాడు. 5వ స్థానం హార్దిక్, 6లో కార్తీక్ వస్తాడు.

కూర్పునకు ఇదే చివరి అవకాశం

అక్టోబరులో టి20 ప్రపంచ కప్.. అది కూడా ఆస్ట్రేలియాలో జరుగనుంది. అన్ని జట్టు తమ టి20 కూర్పుపై అంచనాకు రావడానికి ఆసియా కప్ కీలకం. ఈ టోర్నీలో ఆడే జట్లనే దాదాపుగా ప్రపంచకప్‌ బరిలో దించే ఆస్కారముంది. అందుకే అన్ని జట్లూ తమ కూర్పుపై దృష్టి సారిస్తాయి. ఈ సారి భారత్, పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల్లో పోటీపడే అవకాశం ఉంది. మొదట గ్రూప్‌ దశలో ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడతాయి. సూపర్‌-4కు అర్హత సాధిస్తే మరోసారి అక్కడ తలపడతాయి. ఫైనల్‌ చేరితో మూడోసారి పోటీపడతాయి.

గత ఏడాదిగా నిలకడగా విజయాలు సాధిస్తున్న పాక్‌ మంచి ఫామ్‌లో ఉంది. చివరగా పదేళ్ల క్రితం (2012) ఆసియా కప్‌ గెలిచిన ఆ జట్టు.. ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కొత్త కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ శిక్షణలో శ్రీలంక మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఈ టోర్నీలో ఘనమైన రికార్డు ఉన్న ఆ జట్టు ఆరోసారి విజేతగా నిలవాలనే ధ్యేయంతో కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌.. మళ్లీ షకిబ్‌ సారథ్యంలో సత్తాచాటేందుకు సై అంటోంది. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. టైటిల్‌ బోణీ కొట్టాలని చూస్తోంది. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న అఫ్గానిస్థాన్‌.. పెద్ద జట్లకు షాకివ్వాలనే లక్ష్యంతో ఉంది.