Begin typing your search above and press return to search.

సినిమా చూపించనున్న టీమిండియా క్రికెటర్

By:  Tupaki Desk   |   17 May 2022 2:30 PM GMT
సినిమా చూపించనున్న టీమిండియా క్రికెటర్
X
మన దేశ ప్రజలకు రెండే రెండు మతాలు. ఒకటి క్రికెట్, రెండోది సినిమా. వీటిని ఎంతగా ఆరాధిస్తారంటే.. రెండుగా విడిపోయి విభేదించుకుంటారు కూడా. ఇక క్రికెట్-సినిమా తారల బంధం కూడా తక్కువేం కాదు. రవిశాస్త్రి నుంచి లోకేశ్ రాహుల్ వరకు అందరూ సినిమా తారలకు దగ్గరైన వారే. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ లాంటి కొందరు ఏకంగా సినిమాల్లోనే నటించారు. మరికొందరు క్రికెటర్లు కూడా తెరపై తమ లక్ ను పరీక్షించుకున్నారు. వారిలో అందరి పేర్లూ ఇక్కడ చెప్పలేం.

వాణిజ్య ప్రకటనలతో కెమెరా టచ్ వాస్తవానికి 1980 లకు ముందు క్రికెటర్ల ఆదాయం బహు తక్కువ. వారి కెరీర్ అనంతరం ఆర్థిక భరోసా ఉండేది కాదు. అంతేకాక, వారికి కమర్షియల్ యాడ్స్ అవకాశమే ఉండేది కాదు. కొందరు చేసినా అది అరకొరనే. 99 శాతం మంది నాటి క్రికెటర్లు యాడ్స్ ఆదాయం కళ్ల చూసి ఉండరు.

దిగ్గజ కపిల్ దేవ్ వంటివారు ఎప్పుడో కెరీర్ చరమాంకంలో బూస్ట్ యాడ్ లో అదీ సచిన్ టెండూల్కర్ తో కలిసి కనిపించాడు. అయితే, కాలం మారింది. ఆర్థిక సంస్కరణల అనంతరం విదేశీ కార్పొరేట్ కంపెనీల రాకతో భారత మార్కెట్ పరిధి పెరిగింది. రకరకాల బ్రాండ్లు మన మార్కెట్ ను ముంచెత్తాయి. దీంతో వాటికి ప్రచారకర్తలు అవసరమయ్యారు. జనానికి సుపరిచితులు కాబట్టి క్రికెటర్లు, సినిమా తారలు అందుకు సరిగ్గా సరిపోయేవారు. దీంతో క్రికెటర్లకు కెమెరాతో టచ్ కుదిరింది. ఆదాయం పరిధి పెరిగింది.

ఐపీఎల్ రాకతో మరొక ఎత్తు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ గతినే మార్చింది. అప్పటివరకు స్టార్ క్రికెటర్లకే యాడ్ ఆదాయం ఉండేది. ఐపీఎల్ తో సాధారణ క్రికెటర్ కూ యాడ్ లో కనిపించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆటగాడి జెర్సీ నిండా వాణిజ్య ప్రకటనలే. దీంతోపాటు ఫలానా బ్రాండ్ ను పొగుడుతూ వీడియో ప్రకటనలు కూడా చేస్తున్నారు. ప్రముఖ ఆటగాళ్లయితే వ్యక్తిగతంగా, లేదంటే జట్టంతా కలిసి వీడియో అడ్వర్టయిజ్ మెంట్ చేస్తున్నారు.

సినిమా బంధం ముందే చెప్పుకొన్నట్లు సినిమా-క్రికెట్ లది పెనవేసుకున్న బంధం. వివ్ రిచర్డ్స్-నీనా గుప్తా, విరాట్ కోహ్లి-అనుష్క శర్మ, యువరాజ్ సింగ్ -హేజల్ కీచ్, కేఎల్ రాహుల్-అతియా శెట్టి (బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె) ఇలా ఎందరో క్రికెటర్లు సినిమా తారలను వివాహమాడారు. శ్రీశాంత్, భజ్జీలాంటివారు తెరపై నటించారు. క్రికెట్ దేవుడు సచిన్ కూడా తన బయోపిక్ లో అక్కడడక్కడ కనిపిస్తూ కామెంట్రీ వినిపించాడు.

ఇక టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా త్వరలో సినిమా తెరపై కనిపించనున్నాడు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న "రామసేతు" చిత్రం షూటింగ్ లో కొంతకాలం కిందట ధావన్ కనిపించాడు. అందులో అతను కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ధావన్ మరో సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇది సాదాసీదా సినిమా కాదని భారీ చిత్రమని తెలుస్తోంది. చూద్దాం.. పూర్తి వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో..?